నా గురించి

నా ఫోటో
ఈ బ్లాగ్ ద్వారా కొన్ని తెలుసుకోవలసిన తెలుగు పద్యాల సాహిత్యాన్ని, కొంత ఆద్యాత్మిక విషయాలను రీడర్స్ కు పరిచయం చేయ్యాలని అనుకుంటున్నాను ప్రతి వ్యాసానికి ఎక్కడో ఒకచోట సందర్భోచితంగా లలిత స్మరణం ఉంటుంది. ఈ విధంగా ఈ బ్లాగ్ లలితాంకితం అవుతూ మిమ్మలను పులకాంకితం చేస్తుంది. ఈ బ్లాగ్ లో చాలావరకు వ్యాకరణ దోషాలు లేకుండా చూసుకొన్నాను. ఏమైనా అచ్చు తప్పులు ఉంటె క్షమించి. భావం లోనే తప్పులు ఉంటె తెలియపరచ గలరు. రీడర్స్ ఈ బ్లాగ్ ద్వారా తమ అభిప్రాయాలను, ఆలోచనలను వ్యాఖ్యల ద్వారా పంచుకుంటారని ఆశిస్తున్నాను. మీ సలహాలకు నా సవరణలు, సందేహాలకు నా వివరణలు ఉంటాయి.

అచ్చ తెలుగు బుజ్జి గణపయ్య

అచ్చ తెలుగు బుజ్జి గణపయ్య 
         ఇప్పటి వరకు గణపతిని వేద గణపతి, నాద గణపతి వ్యాసాలలో మహా గణపతి, బ్రహ్మణస్పతి, విఘ్నేశ్వరుడు ఇలా కొంచం గొప్ప పదాలతో గ్రాంధిక బాషతో, కొంచం సంస్కృత సమాసాలతో రాశాను. కానీ ఈ పోస్ట్ లో అచ్చ తెలుగు బుజ్జి గణపయ్య
   ఇక్కడ మంచి తెలుగు పదాలతో. పద్యాలతో, మన బుజ్జి గణపతిని  అచ్చ తెలుగు లో, పచ్చిగా ,పిచ్చిగా  వచ్చింది  నచ్చినట్టుగా ముచ్చటిద్దాం 

ముందు నా చిన్నప్పుడు మా తాతమ్మ చెప్పిన చిన్న పాట తో మొదలెడదాం .
    "  ఒక్కపంటి పొట్టివాడ, నీకు నీ వందనంబు చేసేదార 
    ముక్కు బారెడైన పైకి నిక్కపొడిచి కుడుములన్ని మెక్కి పొట్టపగిలి పాము నోక్కదాన్ని చుట్ట్టినట్టు 
     ఒక్కపంటి పొట్టివాడ, నీకు నీ వందనంబు చేసేదార "

మొత్తం నాకు గుర్తు లేదు కాబట్టి కొంచమే చెప్పాను. ఏంటి ఇలా ఉంది, ఇది గణపతి పాటా కాదా  అనుకోవద్దు ఇది ఖచ్చితం గా గణపతి పాటే ఎలానో చూద్దాం .
ఇక్కడ " ఒక్కపంటి పొట్టివాడు " అంటే ఎవరో కాదు మన బొజ్జ గణపయ్య. కోత్తగా ఏదో కాదు ఏక దంత  (ఒక్క/ఏక పన్ను/దంతం ) , వికట (మరుగుజ్జు/పొట్టి వాడు ) నామాలను కలిపి అచ్చ తెలుగు లో అందంగా చప్పారు. ఇది పల్లవి 
ఇక చరణం "ముక్కు బారెడు" అంటే తొండం (బారు ముక్కు ఉండేది ఏనుగు దాని తల గజముఖుడు/గజాననుడు  ), బారెడు ముక్కు ను పైకి "నిక్కపొడిచాడు" అంటే దాన్ని వేలాడకూడా పైకి మడిచాడు(వక్ర తుండ నామం. ఊరకనే ఏమీ మడవలేదు కుడుములు మెక్కటానికి తొండం ఎత్తాడు 
ఇక్కడ
 1. తొండం ఎత్తాడు అంటే కుడుములు(మోదకములు) చేతులో ఉన్నాయ్. కాబట్టి మోదక హస్తుడు
2. కుడుములు మెక్కుతున్నాడు కాబట్టి మోదక ప్రియుడు అనే నామాలు గుర్తు చేసుకోవచ్చు.  
   ఈన మెక్కటం అట్టా ఇట్టా కాదు గట్టిగానే పొట్ట పగిలేదాకా మెక్కాడు. పొట్ట పగిలింది కాబట్టి వాళ్ళ నాన్న మెళ్ళో ఒక్క  పామును తెచ్చి చుట్టి పొట్ట కుట్టారు. మొత్తం పాట గుర్తుంటే బాగుండేది 
సరే ఇదీ అచ్చ తెలుగు అంటూ చెప్పిన పచ్చి తెలుగు అందం.

"ఒక్కపంటి పొట్టివాడు" అన్నందుకు  పైన ఫోటోలో మన బుజ్జి గణపతి  అలిగినట్టున్నాడు, ఇప్పుడు మంచి అందమైన తెలుగు పద్యం చూద్దాం 

"అంకము జేరి శైల తనయాస్తనదుగ్ధము లానువేళబా
     ల్యాంకవి చేష్ట దొండమున నవ్వలిచన్ గబళింపబోయి, యా
వంకకుచంబుగానకహి వల్లభహారము గాంచి వేమృణా
ళాంకురశంకనంటెడు గజాస్యుని గొల్తునభీష్ట సిద్ధికిన్''
ఇది అల్లసాని పెద్దన మనుచరిత్ర ప్రారంభిస్తూ రాసిన పద్యం  

పసిబిడ్డలు తల్లి ఒడిని చేరి ఒక వంక చనుబాలు తాగుతూ వేరొకవంక ఉన్న స్తనాన్ని చేతితో తడమతం  సహజం పార్వతీదేవి వద్ద పాలు తాగుతున్న పిల్లగణపతి తన తొండంతో  చేసే పిల్ల చేష్టను పెద్దన చమత్కరించాడు. అలా పార్వతికి ఒకవైపు తాగుతున్న గణపతి పార్వతి రెండవవైపు తాగడానికి తొండాన్ని చాచాడు. ఆ వైపు స్తన్యము కనిపించలేదు. సర్పహారాలు కనిపించాయి. అదేంటి పైన ఫోటోలో బాగానే రెండు ఉన్నాయే అనుకోకండి సరైన ఫోటో దొరకలేదు అందుకే కింద ఇంకో ఫోటో ఉంచాను . ఇక్కడ పెద్దన పెద్ద పనే చేసారు. బుజ్జి గణపతిని స్తుతిస్తూనే ఆది దంపతి ఐన (సంస్కృతం ప్రకారం దంపతులు అనేపదం లేదు) పార్వతీ పరమేశ్వరుల అద్వైత తత్వాన్ని అర్ధనారీశ్వర రూపంలో స్మరించాడు. కాబట్టి ఒక్క వైపు స్త్రీ(పార్వతి) కాబట్టి  చన్ను ఉన్నది ఇంకొక వైపు పురుషుడు నాగాభరణుడు కాబట్టి పాముఉంది. గణపతి పిల్ల ఏనుగు కాబట్టి పామును ఆయనకి ఇష్టమైన లేత తామరతూడనుకొని తొందరగా పట్టుకోబోతున్నాడు. అలాంటి ఆయనకే ఏం పట్టుకొంతున్నాడో తెలియని బుజ్జి గణపతి నా కోరికలెల్ల సిద్ధించుటకై సేవిస్తానని పెద్దన స్తుతించాడు.
ఒకే పద్యం లో గణపతిని అద్వైత స్వరూపులైన పార్వతి పరమేశ్వరులని కనపడకుండా అందంగా తెలిపిన నాకిష్టమైన పద్యమిది.


                 శ్రీ కంఠార్ద శరీరిణి 

అన్ని పోస్ట్ ల లో లానే ఇక్కడ కూడా సందర్భానికి తగ్గట్టు లలితా స్మరణం శ్రీ కంఠార్ద శరీరిణి.

కుమార గణనాదాంబా, తుష్టి: పుష్టి మతి ధృతి:  
          దీనికి అర్ధం కుమార స్వామికి, మన బుజ్జి గణపతికి అమ్మ. తర్వతః నాల్గు నామాలకు వేరే అర్ధాలు ఉన్నా వాటికి అర్ధం చెప్పే ధైర్యం లేక నాకు తెలిసిన చమత్కారంతో  చెబుతా.
     తుష్టి:గా  పుష్టిగా వాళ్ళకు తిండి పెట్టింది. వాళ్ళను మతిగల వాళ్ళ లాగా బలంగా చేసింది. కాకపోతే బొజ్జ గణపతికి కాస్త ఎక్కువ పెట్టింది ఎందుకంటే ఆవిడ అవ్యాజ కరుణా మూర్తి కదా. బుజ్జి గణపతి  కాస్తా బొజ్జ గణపతి అయ్యాడు. రెండో వాడికి పెట్టలేదా అనకండి మా లలితమ్మ తప్పు ఏమీ లేదు. వాడికి ఆరుముఖాలు (షణ్ముఖుడు)   ఆరు ఆలోచనలతో సరిగా తినక స్లిమ్ గా ఉన్నాడు. మా బుద్ది గణపతి బుద్దిగా తిని బొద్దుగా అయ్యాడు.


నా చిన్నప్పుడు నేర్చుకొన్న కొన్ని తెలుగు పద్యాలు 

తొండము నేకదంతమును తోరపు బొజ్జయు వామహస్తమున్‌
మెండుగ మ్రోయు గజ్జెలును మెల్లని చూపుల మందహాసమున్‌.
కొండొక గుజ్జురూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జయై
యుండెడి పార్వతీ తనయ ఓయి గణాధిప నీకు మొక్కెదన్‌.

అటుకులు కొబ్బరి పలుకులు చిటిబెల్లము నానబ్రాలు చెరకురసంబున్
నిటలాక్షు నగ్రసుతునకు బటుతరముగ విందుచేసి ప్రార్థింతుమదిన్ ॥

తలచెదనే గణనాధుని, తలచెదనే విఘ్నపతిని, దలచిన పనిగా
దలచెదనే హేరంబుని, దలచెద నా విఘ్నములవి తొలగుట కొరకున్ ॥


ఈ పోస్ట్ పై  మీ విలువైన సలహాలకు సవరణలు, సందేహాలకు వివరణలు తప్పకుండా ఉంటాయి 
Note: the red lettered words are from Lalitha sahasra nama strotram 


- : నాంపల్లి రామకోటేశ్వర్
గండేపల్లి


 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి