నా గురించి

నా ఫోటో
ఈ బ్లాగ్ ద్వారా కొన్ని తెలుసుకోవలసిన తెలుగు పద్యాల సాహిత్యాన్ని, కొంత ఆద్యాత్మిక విషయాలను రీడర్స్ కు పరిచయం చేయ్యాలని అనుకుంటున్నాను ప్రతి వ్యాసానికి ఎక్కడో ఒకచోట సందర్భోచితంగా లలిత స్మరణం ఉంటుంది. ఈ విధంగా ఈ బ్లాగ్ లలితాంకితం అవుతూ మిమ్మలను పులకాంకితం చేస్తుంది. ఈ బ్లాగ్ లో చాలావరకు వ్యాకరణ దోషాలు లేకుండా చూసుకొన్నాను. ఏమైనా అచ్చు తప్పులు ఉంటె క్షమించి. భావం లోనే తప్పులు ఉంటె తెలియపరచ గలరు. రీడర్స్ ఈ బ్లాగ్ ద్వారా తమ అభిప్రాయాలను, ఆలోచనలను వ్యాఖ్యల ద్వారా పంచుకుంటారని ఆశిస్తున్నాను. మీ సలహాలకు నా సవరణలు, సందేహాలకు నా వివరణలు ఉంటాయి.

నా రామయ్య

 శ్రీ రాముడు 

                   రాముడు. అందరకి తెలిసిన దైవం. కానీ  శ్రీ రాముడు మాత్రం అతనిని దైవంగా భావించలేదు. రామాయణం లోని యుద్దకాండలో సీతమ్మను అగ్ని ప్రవేశం చేయమన్నప్పుడు బ్రహ్మరుద్రాదులు ప్రత్యక్షమై సీతారాములను లక్షీనారాయణులు గా గుర్తుచేస్తారు కానీ రామచంద్రుడు మాత్రం "ఆత్మానం మానుషమన్యే రామం ధశరదాత్మజం "  అంటూ తన్ను తాను మానవుని గానే ప్రకటించుకుంటాడు. పరమాత్ముడైన విష్ణువు రామావతారం లో మానవుడిగా ప్రవర్తించటానికి గల ముఖ్య కారణం మానవులకు ఒక  ఆదర్శ మూర్తి ద్వారా ధర్మాచరణను తెలపటం. 

           రాముని గూర్చి తెలుసుకోవటానికి గల గ్రంధం శ్రీ మద్రామాయణం. మనం సాధారణంగా ఉత్తరాయణం, దక్షిణాయనం అనే పదాలు వినే ఉంటాం. "అయనం" అనే పదానికి పయనం, ప్రయాణం అని అర్ధాలు. సూర్య భగవానుడు ఉత్తర దిశకు ప్రయాణం మొదలైతే ఉత్తరాయణం(మకర సంక్రాంతి నుంచి), దక్షిణ దిశకు ప్రయాణం మొదలైతే దక్షిణాయనం(కర్కాటక సంక్రాంతి నుంచి). అదే విధంగా రామాయణం పదం యొక్క అర్ధం తెలుసుకొంటే రాముడు పయనించిన మార్గం. ఇక్కడ రాముడు పయనించిన మార్గం ధర్మ మార్గం. అందువలననే రామాయణంలోని ప్రతి ఘట్టంలో రాముడు ఉంటాడు. రాముడు లేని కధనం మనకు రామాయణంలో మనకు కనపడదు.  "రామో విగ్రహవాన్ ధర్మ:"  కళ్ళతో చూడటానికి నిరాకారమైన ధర్మానికి ఒక రూపం కల్పిస్తే అది రాముడు కనుకనే అది రామాయణం. అందుకని రామాయణం ఒక ధర్మ గ్రంధం.

                రామాయణం ఎంతో మంది కవులచేత మనకు అన్నిభాషలలో అనువదించబడి వారినితరింపచేసింది  ముఖ్యంగా ప్రామాణికమైనవి రెండు  వాల్మికి రామాయణం మరియు  అధ్యాత్మ రామాయణం. మొదటిది బ్రహ్మ ప్రేరితమై వాల్మికి చేత రచింపబడి రాముని ధర్మమూర్తిత్వము   ప్రధానంగా ఉంటె రెండవది పార్వతి పరమేశ్వర సంవాదరూపంలో  శ్రీరాముని పరబ్రహ్మ తత్వము ప్రధానంగా ఉంది 

                "ధర్మం" ప్రతి మానవుడు తరచుగా వాడే పదం. అదేవిధంగా ఎవరికీ ఖచ్చితంగా అర్ధం తెలియని పదం.  ధర్మానికి నిర్వచనం తెలుసుకోవటం కష్టమైన సామాన్య మానవుడు ధర్మాచరణలో నడవటానికి నారాయణుడు నరుడిగా, సాకారమైన ధర్మంగా, మానవులకు ఆదర్శంగా, శ్రీ రామునిగా జన్మించాడు. శ్రీ రాముడు మానవులకు ఆదర్శం అనటానికి ఒకే ఒక కారణం రాముడు తన జీవితం లో ఎక్కడా మహిమలు లాంటివి చూపించలేదు. కేవలం వేద ప్రతిపాదితమైన ధర్మాన్ని ఆచరించాడు. కాబట్టి రామధర్మం మానవులకు ఆచరణ యోగ్యమే.

మారీచుడు :

                  "రామో విగ్రహవాన్ ధర్మ సాధు: సత్య పరాక్రమ:" ఈ శ్లోక భాగం రామాయణం లోనిదే. కాని ఈ మాట ఏ వసిష్టునిదో, లక్ష్మనునిదో కాదు సీతపహరణకు సహాయపడిన రాక్షసుడు మారీచునిది. రామాయణాన్ని కొంచం లోతు గా చుస్తే రావణునికి సదుపదేశం చేసిన వారిలో విభీషణుడు, హనుమ, మండోదరి తో పాటు చెప్పుకోదాగిన వాడు మారీచుడు. సీతాపహరణానికి మారీచుని బంగారు జింకగా మారమని రావణుడు ఆదేశించిన సందర్భంలో  మారీచుడు రావణునికి కొన్ని ధర్మసూష్మాలు చెప్తాడు. ఒక రాక్షసుని నుండి కూడా రామాయణం చదవడం ద్వారా మనం ఎన్నో ధర్మసూష్మాలు తెలుసుకోవచ్చు  మారీచుడు రాముని బాణానికి తగిలి బ్రతికిన ఒకే ఒక్కడు మారీచుడు. ఇతడు రాముని బాణధాటిని మాత్రమే కాకుండా రాముని చరితం, సుగుణాలు, ధర్మాచరణ పూర్తిగా తెలిసి, పంచవటి పరిసరాలలో రాముని కంటికి కనపడకుండా రాక్షసధర్మం పాటిస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆ సమయంలో సీతపహరణకు రావణుడు రావడం జరిగింది. ఆ సమయంలో మారీచుడు  రావణునికి చేసిన ఉపదేశం రాముని ధర్మపరాయణతను ఎంతో గొప్పగా వివరిస్తుంది. మారీచుడు రాముని మూర్తీభవించిన  ధర్మంగా  వర్ణిస్తాడు. ఆ  విధంగా రామ ధర్మాన్ని తెలిసిన మారీచుడు తన ప్రాణాన్ని ధర్మం తప్పకుండానే త్యజించాడు. బంగారు జింకగా మారటానికి నిరాకరించిన మారీచుని రావణుడ చంపుతానని భయపెడతాడు. ధర్మాన్ని తెలిసిన మారీచుడు రాజ శాసనాన్ని  ఉల్లంగించి అటు ధర్మద్రోహానికి ఇటు రావణుని చేతులో మరణించి నరకాని వెళ్ళటం కన్న రాజాజ్ఞను పాటిస్తూ మోక్ష హేతువైన  రాముని చేతులో మరణాన్ని ఆశ్రయించాడు. 

         సీతాన్వేషణ సమయంలో హనుమంతుని ద్వారా సీతను రావణుడు అపహరించాడని తెలుసుకొని, రావణుని జయించగల వాడు వాలి అని తెలిసి కూడా ధర్మ బద్దుడైన సుగ్రీవుని తో స్నేహం చేసాడు. రాముడే కనక పూర్వం రావణుని జయించిన మహావీరుడైన  వాలితో స్నేహం చేసి ఉంటే యుద్ధం లేకుండానే సునాయాసంగా సీతను పొందగలిగేవాడు. అప్పుడు కిష్కింద, సుందర, యుద్ద కాండలు ఉండేవి కావు.  ధర్మ మూర్తి అయిన  రాముడు తమ్ముని భార్యను అపహరించిన వాలి ని వధించి ధర్మ స్థాపన చేసాడు.

 

 

 

 

 

continued...............

లలితా స్మరణం : " రక్షాకరీ రాక్షసఘ్ని రామా రమణలంపటా ".  రామ శబ్దాన్ని స్త్రీ లింగంలో పిలిస్తే లలిత. అంతేకాక అమ్మవారి దశ మహావిద్యలను నారాయణుని దశావతరాల సారూప్యతలో "రామో లలితాంబికా" అంటూ  రాముని లలిత రూపంగాను, కృష్ణుని శ్యామల రూపంగా , నృసింహుని ఛిన్నమస్తగా . . . . . . . . .  ఇలా దశావతారాలు చెప్తారు.
- : నాంపల్లి రామకోటేశ్వర్
గండేపల్లి .

  "రామో విగ్రహవాన్ ధర్మ సాధు: సత్య పరాక్రమ:"
Note: the red lettered words are from Lalitha sahasra nama strotram

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి