నా గురించి

నా ఫోటో
ఈ బ్లాగ్ ద్వారా కొన్ని తెలుసుకోవలసిన తెలుగు పద్యాల సాహిత్యాన్ని, కొంత ఆద్యాత్మిక విషయాలను రీడర్స్ కు పరిచయం చేయ్యాలని అనుకుంటున్నాను ప్రతి వ్యాసానికి ఎక్కడో ఒకచోట సందర్భోచితంగా లలిత స్మరణం ఉంటుంది. ఈ విధంగా ఈ బ్లాగ్ లలితాంకితం అవుతూ మిమ్మలను పులకాంకితం చేస్తుంది. ఈ బ్లాగ్ లో చాలావరకు వ్యాకరణ దోషాలు లేకుండా చూసుకొన్నాను. ఏమైనా అచ్చు తప్పులు ఉంటె క్షమించి. భావం లోనే తప్పులు ఉంటె తెలియపరచ గలరు. రీడర్స్ ఈ బ్లాగ్ ద్వారా తమ అభిప్రాయాలను, ఆలోచనలను వ్యాఖ్యల ద్వారా పంచుకుంటారని ఆశిస్తున్నాను. మీ సలహాలకు నా సవరణలు, సందేహాలకు నా వివరణలు ఉంటాయి.

నాద గణపతి

నాద గణపతి

              గణపతి కి ఇంకొక నామం విఘ్నేశ్వరుడు. నా చిన్న అనుభవం ఒకటి చెప్పి నాద గణపతి వ్యాసాన్ని కొనసాగిద్దాం. వినాయక నవరాత్రులలో హైదరాబాద్ లో ఒక ఇంటికి వెళ్ళవలసి వచ్చింది. ఆ ఇంటికి ఎటుతిరిగి వెళ్ళాలన్న ఆ వీధికి ఒక వినాయక మండపం వీధిని మూసేసి అడ్డంగా ఉండేది. ఇలాంటి పరిస్టితి చాలామందికి ఎదురై ఉండవచ్చు. సామాన్యంగా అందరికి విఘ్నేశ్వరుడు అంటే విఘ్నాలు(ఆటంకాలు) కలగకుండా చుసేవాడని నమ్మకం. మొత్తానికి వినాయక నవరాత్రులలో ప్రయాణానికి విఘ్నేశ్వరుడే విఘ్నం అయ్యాడు అని నాకు అనిపించింది.


నిజానికి విఘ్నేశ్వర శబ్దానికి అర్ధం విఘ్నాలకు అధిపతి అని. విఘ్నాలు లేకుండా చేసేవాడు అని అర్ధం కాదు. విఘ్నాలు ఈయన అధీనంలో ఉండి ఈయన చెప్పినట్టు వింటాయి. కాబట్టి ఈయన విఘ్నాలను కలిగించవచ్చు  లేక కలగకుండా చూడవచ్చు. రావణునికి ఆత్మలింగం లభించకుండా విఘ్నం కలిగించింది గణపతే. ఈ విధంగా విఘ్నం కలిగిస్తూ కూడా గణపతి లోకకల్యాణం చేస్తూ ఉన్నాడు. ఇది విఘ్నేశ్వర నామం అర్ధం మన వ్యాసానికి నేపద్యం. ఇప్పుడు మన వ్యాసం నాద గణపతి లోనికి వద్దాం. 
               వ్యాసం శీర్షిక నాద గణపతి. అంటే నాదానికి కారణమయ్యే గణపతిని తెలుసుకొందాం. నాదం అంటే ఒక క్రమబద్దమైన శబ్దం. ఇక్కడ శబ్దాన్ని క్రమబద్దీకరించే గణపతిని నాద గణపతి అనుకొందాం.  శబ్దం రావటానికి కారణం గాలి. ఆ గాలికి కి విఘ్నాలు కలిగించటం ద్వారా నాదం పుడుతుంది. ఇది కొంచం కొత్తగా ఉండచ్చు కానీ ఎలా అంటే ఉదాహరణకు వేణువు నుంచి వేణు నాదం రావాలంటే వేణువు లోకి గాలిని ఊది, దాని రంద్రాలలో వేళ్ళతో ఒక క్రమ పద్దతిలో విఘ్నాలను కలిగిస్తూ ఉంటే శ్రావ్యమైన వేణునాదం వినిపిస్తుంది. విఘ్నాలు కలిగించక పోతే ఒకే శబ్దం వస్తుంది. ఇప్పుడు మనం మాట్లాడే మాటలు(అక్షరాలు, పదాలు)  కూడా శబ్దం నుంచి వచ్చిన నాదాలే. కాబట్టి ఈ నాదాలు ఉద్బవించటానికి, ధ్వనికి విఘ్నం కలిగించి నాదం కలిగించేది ఎవరు అనేది తెలుసుకొందాం.

నాదాన్ని పరబ్రహ్మ స్వరూపం గా భావిస్తారు.

పరమేశ్వరుని

నాదయుతో మహా సిత వపు: అని ఆది శంకరులు,నాద తనుం అనిశం శంకరం అని త్యాగరాజు,శంకరా నాద శరీర హరా అని వేటూరి గారు కూడా కీర్తించారు.

లలితా సహస్ర నామం లో రెండు నామాలు అమ్మవారిని నాద రూపంగా చెప్పాయి.

వీర గోష్టి ప్రియా వీరా నైష్కర్మ్యా నాద రూపిణి

నారాయణీ నాదరూపా నామరూప వివర్జితా

 ఈ విధం గా ప్రకృతి పురుషులు ఐన పార్వతి పరమేశ్వరులు ఇద్దరు నాద స్వరూపులు .


 గణపత్యథర్వ శీర్షోపనిషత్ లో గణపతి గురించి " ఆవిర్భూతం చ సృష్ట్యాదౌ ప్రకృతే: పురుషాత్పరమ్ " అని , అంటే ప్రకృతి పురుషులకంటే ముందు సృష్టి ఆదిలో ఆవిర్భవించినవానిగా తెల్పింది.

అంతే కాక

 "త్వం మూలాధార స్థితో సి నిత్యం",

త్వం చత్వారి వాక్ పదాని ” ,

అనే మంత్రాలను ప్రస్తావించింది. షట్చక్రాలలో మొదటిదైన మూలాధార చక్రం గణపతి స్థానంగా చెప్పబడింది. "చత్వారి వాక్ పదాని" అనే పదం ద్వారా వాక్కు నాలుగు రూపాలలో ఉంటుందని తెలుసుకోవచ్చు . అవి పరా , ప్రత్యక్ , మధ్యమ , వైఖరి . ఈ నాలుగు రూపాంతరాలు మనం లలితా సహస్ర నామాలలో గమనించవచ్చు . 

పరా, ప్రత్యక్చితీ రూపా, పశ్యంతీ, పరదేవతా |
మధ్యమా, వైఖరీరూపా, భక్తమానస హంసికా॥ 

మూలాధారంలో పరా రూపంలో జనించిన శబ్దం తర్వాత రెండు రూపాలలోకి మారుతూ చివరిదైన వైఖరి రూపం లో మనచే పలుకబడుతుంది. 

మూలాధార చక్రం లో వాయువు రూపంలో శబ్దం పుడుతుంది. ఈ వాయువు వైఖరి గా మారటానికి ఎన్నో అడ్డంకులు అవసరమవుతాయి .  ఉదాహరణకు వేణువు మొదటి రంద్రంలో ప్రవేశించిన గాలి మిగిలిన రంద్రాలలో కలిగిన అడ్డంకుల వలన వేణునాదం పుడుతుంది. అదేవిధంగా మొదటి చక్రం ఐన మూలాధారంలో పరా అనే వాయువుకు విఘ్నాలు కలిగించి వైఖరి అనే మన వాక్కుకు కారణభూతుడు నాద గణపతి. కాబట్టి గణపతి విఘ్న నాశకుడు మాత్రమే కాకుండా విఘకారకుడుగా కూడా ఉండి విఘ్నేశ్వరుడు అవుతున్నాడు. 

ఈ నాలుగు రూపాలైన వాక్కుల యొక్క స్వభావం ఋగ్వేదంలోని సరస్వతి సూక్తం లోని మంత్రం తెలుపుతుంది. 

  ఈ మంత్రం ద్వారా వాక్కు కు నాలుగు రూపాతాన్తరాలని, మొదటి మూడు మానవునకు తెలియనివి (గుహా త్రీణి) అని. నాల్గవదైన (తురీయం వాచో) వైఖరి ని మానవులు పలుకుతున్నారని తెలుపబడుతుంది. 

ఈ విధం గా దేవి రూపం ఐన వాక్కుకు గణపతి కారణం అవుతూ నాద గణపతి అవుతున్నాడు.

 

 


ఈ పోస్ట్ పై  మీ విలువైన సలహాలకు సవరణలు, సందేహాలకు వివరణలు తప్పకుండా ఉంటాయి 
Note: the red lettered words are from Lalitha sahasra nama strotram 

- : నాంపల్లి రామకోటేశ్వర్
గండేపల్లి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి