నా గురించి

నా ఫోటో
ఈ బ్లాగ్ ద్వారా కొన్ని తెలుసుకోవలసిన తెలుగు పద్యాల సాహిత్యాన్ని, కొంత ఆద్యాత్మిక విషయాలను రీడర్స్ కు పరిచయం చేయ్యాలని అనుకుంటున్నాను ప్రతి వ్యాసానికి ఎక్కడో ఒకచోట సందర్భోచితంగా లలిత స్మరణం ఉంటుంది. ఈ విధంగా ఈ బ్లాగ్ లలితాంకితం అవుతూ మిమ్మలను పులకాంకితం చేస్తుంది. ఈ బ్లాగ్ లో చాలావరకు వ్యాకరణ దోషాలు లేకుండా చూసుకొన్నాను. ఏమైనా అచ్చు తప్పులు ఉంటె క్షమించి. భావం లోనే తప్పులు ఉంటె తెలియపరచ గలరు. రీడర్స్ ఈ బ్లాగ్ ద్వారా తమ అభిప్రాయాలను, ఆలోచనలను వ్యాఖ్యల ద్వారా పంచుకుంటారని ఆశిస్తున్నాను. మీ సలహాలకు నా సవరణలు, సందేహాలకు నా వివరణలు ఉంటాయి.

కార్తీక స్నానం - వైజ్ఞానిక దృష్టి

కార్తీక స్నానం - వైజ్ఞానిక దృష్టి

                    ఈ పోస్ట్ లో  మనం కార్తీక స్నానంలో మన మహర్షులకు గల అంతర దృష్టి ఆలోచించే ప్రయత్నం చేద్దాం. కార్తిక స్నానం తెలుసుకొనే ముందు అసలు "స్నానం" అంటే ఏమిటో ముందు ఆలోచించవలసిన అవసరం ఉంది. అందరికి తెలిసి స్నానం అంటే శరీర శుభ్రత. కేవలం శారీరిక శుభ్రత మాత్రమే అయితే మనిషి అశుభ్రత ఉన్నప్పుడు మాత్రమే స్నానం చేస్తే సరిపోతుంది. కాని మన వైదిక సాంప్రదాయం లో రెండు పూటలా స్నానం చెప్పబడింది. అంతే కాక త్రికాల సంధ్యావందనంలో మూడు పూటలా స్నానం చెప్పబడింది. రోజు శారీరిక శ్రమ లేకుండా వేదాధ్యనం చేస్తూ ఇంట్లో ఉండే వాడికి అశుబ్రత ఏమాత్రం ఉండదు. అలాంటివాడికి కుడా మూడు పూటలా స్నానం అవసరం ఏమాత్రం ఉండదు. ఐనప్పటికీ స్నానం చేయమని ఆదేశించటంలోని అంతర్యం కేవలం శారీరిక శుభ్రతమాత్రమే కాదు అనేది సుస్పష్టం. 
                     స్నానం లో మహర్షులు ప్రత్యేకంగా నిర్దేశించినది అంతరంగిక శుద్ధి. బాహ్య స్నానంతో అంతరంగిక శుద్ధి ఎలా జరుగుతుందో ఆలోచిద్దాం. మనవ శరీరం లోని స్పర్శ జ్ఞానం మొత్తం కేవలం చర్మం లోని నాడుల ద్వారా విద్యుత్ శక్తి మెదడుకు చేరటం ద్వారా పనిచేస్తుంది. చల్లటి నీళ్ళ స్నానం వల్ల శరీరం మొత్తం నాడులు ఒకేసారి చైతన్యం అవటం నేను వివరించవలసిన అవసరం లేకుండా అందరికి అనుభవమే. కాబట్టి స్నానం లోని ప్రధాన ఉద్దేశ్యం శరీర చైతన్యం. మానసిక చైతన్యంతో చేసే జప ధ్యానాలు మాత్రమే కాకుండా దైనందిన కార్యక్రమాలు కుడా సత్ఫలితాలు ఇస్తాయి.  చైతన్యం దేవీ స్వరూపం. దేవీ భాగవత ప్రధమ శ్లోకం గాయత్రీ చందస్సులో "సర్వ చైతన్య రూపాం తాం ఆద్యాం ....... " అని, దుర్గా సప్తశతి "యా దేవి సర్వ భూతేషు చేతనత్యభిదీయతే ....... " అని, లలితా సహస్రం "చిచ్చ క్తి చేతనా రూపా ....... " అని దేవిని కీర్తించాయి. కావున చైతన్యం దేవీ స్వరూపం. బుద్ది చైతన్యం కోరుకోవటం సంధ్యా వందనంలో గాయత్రి మహా మంత్ర ప్రధాన అర్ధం. కాబట్టే "స్నానం సంధ్య" , "చదువు సంధ్యలు" అనే వాడుక పదాలు వచ్చాయి. 
                            అంతే కాక స్నానంలో మనం గమనిస్తే ఇంకా కొన్ని గొప్ప లక్షణాలు కూడా ఉన్నాయి. స్నానం చేసే సమయంలో అసంకల్పితంగా ప్రాణాయామం జరుగుతుంది. ఈ ప్రాణాయామం సాధనా క్రమం లో ఉండక పోవచ్చు కానీ యోగ శాస్త్రం ప్రకారం ప్రాణాయామం ఆయుష్షు ను పెంచుతుంది అనేది వైజ్ఞానికంగా నిరూపించబడిన విషయం. ప్రాణాయామం చిత్తశుద్ది ని పెంచుతుంది కాబట్టే ప్రతి దైవిక కార్యక్రమాలలో ముందు ప్రాణాయామం తప్పనిసరి. ప్రస్తుత పరిస్తితులలో ఇది ముక్కు పట్టుకోవటంలా మారిపోయింది. పట్టుకోమన్నవాడు చెప్పడు. పట్టుకొంటున్న వాడు అడగడు. అది అలా ఉంచితే ఇంకొక ప్రయోజనం స్నానం జటరాగ్ని ని  శాంతింపచేస్తుంది. తద్వారా ఆకలిని తగ్గిస్తుంది. పరమేశ్వరుడు భగవద్గీత లో "అహం వైశ్వానరో భూత్వా ప్రాణినా దేహమాశ్రిత"  అని తెలిపాడు, జటరాగ్ని భగవత్ స్వరూపం. ఇంకా మితాహారం పరమౌషధం అని ఆయుర్వేదం.
                          శిరస్నానంలో బ్రహ్మరంద్రం వద్ద సహస్రారచక్రం మీద పడే నీరు ఆద్యాత్మిక శక్తీని ఇస్తుంది. లలితా సహస్రంలో "సహస్రారాంబుజారూడా సుధాసారాభి వర్షిణి" అనే నామం అమ్మవారు బ్రహ్మ రంద్రం వద్ద గల సహస్రార చక్రంలో ఉంది అమృత ధారలను వర్షిస్తుంది అని తెలుపుతుంది. అమృత ధార అనగా Electric waves గా తీసుకోవచ్చు. ఆ అమృత ధారల ద్వారా ఆరు చక్రాలను చైతన్య పరుస్తుంది. " తటిల్లతా సమరుచి షట్చక్రోపరి సంస్థితా " అనే నామం లో "తటిల్లత" అంటే మెరుపు తీగ Electric waves ను సూచిస్తూ వాటి ద్వారా కింద గల షట్చక్రాలను చైతన్యపరుస్తుంది.
                           ఇప్పటివరకు స్నాన వైశిష్ట్యం తెలుసుకొన్నాం. ఇప్పుడు కార్తీక మాసంలో స్నానం యొక్క విశేషం తెలుసుకొందాం. కార్తీక పురాణం చదివే అలవాటు ఉంటే అందులో గోష్పాదమంత తటాకంలో కుడా గంగానది అంతర్వాహినిగా ఉంటుంది అని చెప్పబడింది. ఎక్కడో హిమాలయాలలో ఉన్న గంగ ఈ నెలలో అన్ని చోట్లలో ఉండటం అసంభవం. మరి వైదిక ధర్మం చెప్పినది అసత్యం కావటం కుడా అసంభవం. మరి ఇక్కడ అంతరార్ధం ఈ నెలలో స్నానం గంగాస్నాన ఫలం ఇస్తుంది. అసలు గంగా స్నాన ఫలం అంటే గంగ జలాలలో ఉన్న ఔషధీ శక్తి, దైవిక శక్తి మనం పొందటం. స్నానం ఆ ఫలితాలు ఇవాలంటే ఆ జలాలలో ఆ శక్తులు ఉండాలి.  కార్తీక మాసంలో జలాలకు ఈ శక్తులు ఎలా వస్తాయో ఆలోచించే ప్రయత్నంచేద్దాం.
                             మొదటిది ఓషధీ శక్తి. ఇది సహజంగా గంగకు హిమాలయాలలోని ఓషధుల వల్ల వస్తుంది. మరి సాధారణ జలాలకు ఎలా వస్తుంది అంటే కార్తీక మాసం వల్ల ముఖ్యంగా కార్తీక మాసంలో చంద్ర కిరణాల వల్ల వస్తుంది. శ్రావణ, భాద్రపద మాసాలలో వర్షఋతువు వల్ల నదులకు నీరు చేరుతుంది. అది వరద నీరు అపరిశుబ్రం. ఆశ్వయుజ మాసంలో ఆ నీరు తేరుకొని శుబ్రమవుతుంది. కాబట్టి ఆశ్వయుజ అమావాస్య దీపావళి వరకు నదీ స్నానం నిషిద్ధం, ఆశ్వయుజ, కార్తీక మాసాలు శరదృతువు. శరదృతువు ప్రధాన లక్షణం మంచి వెన్నెల. పౌర్నమికి కృత్తిక (లేక  రోహిణి)   నక్షత్రం లో చంద్రుడు ఉన్నప్పుడు వచ్చే మాసం కార్తీక మాసం. జ్యోతిశాస్త్రంలో ఆలోచిస్తే కృత్తిక చివరి 3 పాదాలు,  రోహిణి, మృగశిర మొదటి 2 పాదాలు వృషభ రాశి. వృషభం చంద్రునికి ఉచ్చ రాశి కావున బలంగా ఉంటాడు. జలరాశి ఐన కర్కాటకానికి చంద్రుడు అధిపతి. చంద్రుడు సహజ జలతత్వ గ్రాహం. జాలలకు, ఓషధులకు కారకుడు. ఖగోళ జ్యోతిశాస్త్రజ్ఞుడు ఐన వరాహమిహిరుడు నదీ జలాల శుద్ధి క్రమాన్ని వివరిస్తూ సూర్య కిరణాలతో తప్తమై అగస్త్య నక్షత్ర కిరణాలతో విష హరణం జరిగి చంద్ర కిరణాలతో ఔషధీకరణ జరుగుతాయని తెలిపాడు. ఆహార మొక్కలు సూర్య కిరణాలపై ఆధారపడితే ఔషధ మొక్కలు చంద్ర కిరణాలపై ఆధారపడతాయి. ఆయుర్వేదంలో మూలికా సేకరణ జ్యోతిశ్చక్రంలో చంద్రగతి పై ఆధారపడి ఉంటుంది. మూలికకు సంబందించిన నక్షత్రంలో చంద్రుడు ఉన్నప్పుడు సేకరించిన మూలిక మాత్రమే ఔషదంగా పనిచేస్తుంది. కాబట్టి కార్తీక మాసంలో బలమైన చంద్రకిరణాల ద్వారా నదీ జలాలు ఓషధి శక్తీ పొందుతాయి.
                            ఇక జలాలలో దైవీ శక్తి శివ శక్తి. శివుని అష్ట మూర్తులు పంచ భూతాలు(5), సూర్యచంద్రులు(2), యజ్ఞపురుషుడు(1). వీరిలో జలరూప మూర్తి పేరు భవుడు. భవుడు, రుద్రుడు, శర్వుడు, భీముడు ....... మొదలైన 8 నామాలు వారి భార్యల నామాలు మహన్యాస పూర్వక రుద్రార్చనలో మనం వినచ్చు. శివుడు భవుని రూపం లో జలాలను ఆశ్రయించి ఉంటాడు. జ్యోతిశాస్త్రంలో అత్మకారకుడైన సూర్య గ్రహానికి అధిదేవత రుద్రుడు, మనః కారకుడైన చంద్ర గ్రహానికి అధిదేవత గౌరీ. కాబట్టి ఉమామహేశ్వరుల శక్తి జలాలలో చేరుతుంది.
                        దీనిని బట్టి శాస్త్రీయంగా చంద్ర కిరణ ప్రభావం ఉన్న నీటితో చేసే స్నానం కార్తిక స్నానం.  కార్తీక పురాణం గోష్పాదమంత తటాకం(ఆవు అంగ వేసినంత చిన్న విస్తీర్ణం గల తటాకం) లో కుడా గంగ అంతర్వాహిని అనటానికి కారణం ఇదే. వైదిక ధర్మాలను సశాస్త్రీయంగా తెలుసుకొని ఆచరించినప్పుడు మాత్రమే వాటి ఫలితాలను పరిపూర్ణంగా పొందగలము. 
      కార్తీక మాసంలో మరో ముఖ్యమైనది కార్తీక దీపం దీని సశాస్త్రీయత కుడా మరో పోస్ట్ లో తెలుసుకొందాం .........

-:   స్వస్తి   :-
                          
- : నాంపల్లి రామకోటేశ్వర్
గండేపల్లి