నా గురించి

నా ఫోటో
ఈ బ్లాగ్ ద్వారా కొన్ని తెలుసుకోవలసిన తెలుగు పద్యాల సాహిత్యాన్ని, కొంత ఆద్యాత్మిక విషయాలను రీడర్స్ కు పరిచయం చేయ్యాలని అనుకుంటున్నాను ప్రతి వ్యాసానికి ఎక్కడో ఒకచోట సందర్భోచితంగా లలిత స్మరణం ఉంటుంది. ఈ విధంగా ఈ బ్లాగ్ లలితాంకితం అవుతూ మిమ్మలను పులకాంకితం చేస్తుంది. ఈ బ్లాగ్ లో చాలావరకు వ్యాకరణ దోషాలు లేకుండా చూసుకొన్నాను. ఏమైనా అచ్చు తప్పులు ఉంటె క్షమించి. భావం లోనే తప్పులు ఉంటె తెలియపరచ గలరు. రీడర్స్ ఈ బ్లాగ్ ద్వారా తమ అభిప్రాయాలను, ఆలోచనలను వ్యాఖ్యల ద్వారా పంచుకుంటారని ఆశిస్తున్నాను. మీ సలహాలకు నా సవరణలు, సందేహాలకు నా వివరణలు ఉంటాయి.

సంధ్యాసుందరి

శ్రీ:

సంధ్యాసుందరి

           కాల గమనంలో సంధ్యా సమయం ఒక అందమైన భగవత్ సృష్టి. ఈ వ్యాసం శీర్షిక సంధ్యను సుందరిగ వర్ణించటం జరిగింది.  బ్రహ్మ సంధ్య అనే పేరుతో ఒక సౌందర్య రాశిని సృష్టించి ఆమెను మొహించటం వలన ఆమె ఒక లేడి రూపంలో పారిపోవడం, బ్రహ్మ అదే రూపంలో వెంబడించటం, దానికి శివాగ్రహానికి గురవ్వటం, బ్రహ్మ మృగశిర నక్షత్ర రూపంలో మారటం, బ్రహ్మని వెంబడించిన శివుని బాణం ఆర్ద్ర నక్షత్ర రూపంలో మారటం, ఇటువంటి కథ ని మనం శివ మహిమ్న స్త్రోత్రం లో గమనించవచ్చు. కాని ఈ శీర్షికలో మనం తెలుసుకోబోయే సౌందర్యం బ్రహ్మ సృష్టించిన స్త్రీ సౌందర్యం కాదు బ్రహ్మను సృజించిన లోకాతీత శ్రీ సౌందర్యం.  సంధ్యా సమయంలో గోచరమయ్యే త్రిపురసుందరి యొక్క సౌందర్యాన్ని సంధ్యాసుందరి గా వర్ణించే ప్రయత్నం ఈ "సంధ్యాసుందరి" వ్యాసం.

                      సంధ్యా సమయం మొదట చీకటితోను తర్వాత అరుణోదయం ఉండి సూర్యోదయం తో ముగుస్తుంది. కాబట్టి సంధ్య వర్ణం ఉదయించే సూర్యుని వర్ణం(ఉద్యత్భాను సహస్రాభా). సంధ్య అరుణ వర్ణం లోకమంతా వ్యాపించి ఉంటుంది. జగన్మాత ఆమె కరుణను అరుణ వర్ణ ప్రభతో సమస్త బ్రహ్మాండములను ముంచి వేసింది (నిజారుణ ప్రభాపూర మజ్జత్బ్రహ్మాండమండలా) . అంతే కాక ఆమె ధరించిన వస్త్రం రంగు కూడా అరుణారుణ వర్ణమే, ( అరుణారుణ కౌసుంబ వస్త్ర భాస్వత్కటీతటీ ). అది మాత్రమే కాదు, లలిత ధ్యాన శ్లోకాలు కూడా అరుణ వర్ణ వైభవం తోనే ( సింధూరారుణ విగ్రహాం, అరుణాం కరుణాతరంగితాక్షీం, సకుంకుమ విలేపనాం.........)  ప్రారంభామవటం కూడా ఒక విశేషం. కాబట్టి సంధ్య రూపంలో ఉన్నఆమె సర్వారుణ ఐన లలితాంబికే.  లలితా సహస్ర నామలలోని ఒక నామం సంధ్య

"గాయత్రీ వ్యాహృతి సంధ్యా  ద్విజ బృంద నిషేవితా "

        పై శ్లోక భాగం నాలుగు నామాల సమూహం. ఈ నాలుగు నామాల అర్ధాన్ని కలిపి గ్రహిస్తే, నిత్య సంద్యావందనం లో జపించే 24 అక్షరాల గాయత్రీ మంత్రం, దానికి ముందు చేర్చబడే మూడు వ్యాహృతులు, వాటి ద్వారా ఉపాసించబడే సంధ్య కుడా లలిత గానే చెప్పబడింది. ద్విజబృంద నిషేవితా అనే నామం ద్వారా బ్రాహ్మణులు త్రిసంధ్యలలో జపించే గాయత్రి మంత్ర అధిష్టాన దేవత కుడా లలితనే. అంతే కాకుండా గాయత్రీ మంత్రానికి అధిష్టాన దేవతగా  చెప్పబడిన సవిత అనే నామం కూడా లలిత సహస్రనామం సావిత్రి (సర్వార్ధ దాత్రీ సావిత్రీ  సచ్చిదానంద రూపిణి )రూపం లో కలిగిఉంది. కాబట్టి సంధ్యా సమయం లో తప్పనిసరిగా ఆరాధించ వలసిన లలితా త్రిపురసుందరియే సంధ్యాసుందరి. గాయత్రీ  కవచంలో ఆవాహనచేసే గాయత్రి, సావిత్రి, సరస్వతి( సరస్వతి శాస్త్రమయీ గుహాంబా గుహ్య రూపిణి ) అనే మూడు నామాలను లలితా సహస్ర నామస్తోత్రం కలిగిఉంది

భానుమండల మధ్యస్థా 

      లలితా సహస్ర నామాలలో ఇంకొక నామం " భానుమండల మధ్యస్థా " ఆదిత్య హృదయం సూర్యుని సర్వదేవాత్మకునిగా తెలిపింది. కర్మ సాక్షి ఐన సూర్యుని ద్వారా నే దేవతలు కర్మ ఫలాన్ని మానవులుకి ప్రసాదిస్తారు.కాబట్టి మానవులు చేసే కర్మలుకుడా సూర్యుని గమనాన్ని అనుసరిస్తూ  చేయాలనీ శాస్త్రం చెబుతుంది. ప్రాతః సంధ్య లో ప్రధాన దేవతల శక్తీ కలిగిన సూర్య బింబం  క్రమంగా ఒక్కొక్క దేవతల శక్తిని పొందుతూ మద్యాహ్న సమయానికి సమస్త దేవతా శక్తులను కలిగి ఉంటుంది. కాబట్టే యజ్ఞ యాగాదులు సూర్యోదయం తర్వాతనే మొదలు పెట్టాలని పితృ దేవతారాధన అపరాహ్ణ కాలంలో(పితృ దేవతలు సూర్య మండల వర్తులు ఐన తర్వాత) చేయాలనీ చెప్పబడింది. ప్రధాన దేవత ఐన లలిత ప్రాతః కాల సూర్యబింబం లో అరుణ వర్ణం లో సంధ్యా సుందరిలా ప్రకాశిస్తుంది. అంతే కాకుండా గాయత్రి మంత్రాధిష్టాన దేవత ఐన 'సవిత' నామాన్ని కూడా లలితా సహస్ర నామాలు సావిత్రి అనే నామం గా కలిగి ఉంది

      గాయత్రి మంత్రం 24 అక్షరాలలోని మొదటి అక్షరం ఐన "తత్" శబ్దాన్ని ఉపనిషత్తులు పరబ్రహ్మ స్వరూపానికి 'తత్' సర్వనామం గా తెలిపాయి.  (ఓం తత్ బ్రహ్మ, తత్ వాయు :......... అని మంత్రపుష్పం లో కూడా మనం గమనించవచ్చు, అద్వైతంలో మహా వాక్యం ఐన 'తత్వమసి' కూడా తత్ శబ్దాన్ని పరబ్రహ్మ వాచకాన్ని తెలుపుతుంది. )

“చితి: తత్పద లక్ష్యార్దా చిదేకరసరూపిణి” 'తత్పద లక్ష్యార్దా' అనే పదం అమ్మవారిని బ్రహ్మ పద లక్ష్యార్ధం ఉంటుందని తెలుపుతుంది. అదే విదంగా గాయత్రీ లోని "తత్ సవితు:" అనే పదం కూడా పరబ్రహ్మను సవితృ రూపంలో తెలుపుతుంది. గాయత్రీ మంత్రానికి ఛందస్సు గాయత్రి ఐతే సూర్య మండలాన్తర్వర్తి ఐన సవితః దేవత. కాబట్టి సంధ్య సమయం లో ఉపాసించే గాయత్రి "సవితృ గాయత్రి”







శ్రీ



లలితా సహస్రం
continued.........


- : నాంపల్లి రామకోటేశ్వర్
గండేపల్లి 


Note: the red lettered words are from Lalitha sahasra nama strotram

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి