నా గురించి

నా ఫోటో
ఈ బ్లాగ్ ద్వారా కొన్ని తెలుసుకోవలసిన తెలుగు పద్యాల సాహిత్యాన్ని, కొంత ఆద్యాత్మిక విషయాలను రీడర్స్ కు పరిచయం చేయ్యాలని అనుకుంటున్నాను ప్రతి వ్యాసానికి ఎక్కడో ఒకచోట సందర్భోచితంగా లలిత స్మరణం ఉంటుంది. ఈ విధంగా ఈ బ్లాగ్ లలితాంకితం అవుతూ మిమ్మలను పులకాంకితం చేస్తుంది. ఈ బ్లాగ్ లో చాలావరకు వ్యాకరణ దోషాలు లేకుండా చూసుకొన్నాను. ఏమైనా అచ్చు తప్పులు ఉంటె క్షమించి. భావం లోనే తప్పులు ఉంటె తెలియపరచ గలరు. రీడర్స్ ఈ బ్లాగ్ ద్వారా తమ అభిప్రాయాలను, ఆలోచనలను వ్యాఖ్యల ద్వారా పంచుకుంటారని ఆశిస్తున్నాను. మీ సలహాలకు నా సవరణలు, సందేహాలకు నా వివరణలు ఉంటాయి.

నా రామయ్య

 శ్రీ రాముడు 

                   రాముడు. అందరకి తెలిసిన దైవం. కానీ  శ్రీ రాముడు మాత్రం అతనిని దైవంగా భావించలేదు. రామాయణం లోని యుద్దకాండలో సీతమ్మను అగ్ని ప్రవేశం చేయమన్నప్పుడు బ్రహ్మరుద్రాదులు ప్రత్యక్షమై సీతారాములను లక్షీనారాయణులు గా గుర్తుచేస్తారు కానీ రామచంద్రుడు మాత్రం "ఆత్మానం మానుషమన్యే రామం ధశరదాత్మజం "  అంటూ తన్ను తాను మానవుని గానే ప్రకటించుకుంటాడు. పరమాత్ముడైన విష్ణువు రామావతారం లో మానవుడిగా ప్రవర్తించటానికి గల ముఖ్య కారణం మానవులకు ఒక  ఆదర్శ మూర్తి ద్వారా ధర్మాచరణను తెలపటం. 

           రాముని గూర్చి తెలుసుకోవటానికి గల గ్రంధం శ్రీ మద్రామాయణం. మనం సాధారణంగా ఉత్తరాయణం, దక్షిణాయనం అనే పదాలు వినే ఉంటాం. "అయనం" అనే పదానికి పయనం, ప్రయాణం అని అర్ధాలు. సూర్య భగవానుడు ఉత్తర దిశకు ప్రయాణం మొదలైతే ఉత్తరాయణం(మకర సంక్రాంతి నుంచి), దక్షిణ దిశకు ప్రయాణం మొదలైతే దక్షిణాయనం(కర్కాటక సంక్రాంతి నుంచి). అదే విధంగా రామాయణం పదం యొక్క అర్ధం తెలుసుకొంటే రాముడు పయనించిన మార్గం. ఇక్కడ రాముడు పయనించిన మార్గం ధర్మ మార్గం. అందువలననే రామాయణంలోని ప్రతి ఘట్టంలో రాముడు ఉంటాడు. రాముడు లేని కధనం మనకు రామాయణంలో మనకు కనపడదు.  "రామో విగ్రహవాన్ ధర్మ:"  కళ్ళతో చూడటానికి నిరాకారమైన ధర్మానికి ఒక రూపం కల్పిస్తే అది రాముడు కనుకనే అది రామాయణం. అందుకని రామాయణం ఒక ధర్మ గ్రంధం.

                రామాయణం ఎంతో మంది కవులచేత మనకు అన్నిభాషలలో అనువదించబడి వారినితరింపచేసింది  ముఖ్యంగా ప్రామాణికమైనవి రెండు  వాల్మికి రామాయణం మరియు  అధ్యాత్మ రామాయణం. మొదటిది బ్రహ్మ ప్రేరితమై వాల్మికి చేత రచింపబడి రాముని ధర్మమూర్తిత్వము   ప్రధానంగా ఉంటె రెండవది పార్వతి పరమేశ్వర సంవాదరూపంలో  శ్రీరాముని పరబ్రహ్మ తత్వము ప్రధానంగా ఉంది 

                "ధర్మం" ప్రతి మానవుడు తరచుగా వాడే పదం. అదేవిధంగా ఎవరికీ ఖచ్చితంగా అర్ధం తెలియని పదం.  ధర్మానికి నిర్వచనం తెలుసుకోవటం కష్టమైన సామాన్య మానవుడు ధర్మాచరణలో నడవటానికి నారాయణుడు నరుడిగా, సాకారమైన ధర్మంగా, మానవులకు ఆదర్శంగా, శ్రీ రామునిగా జన్మించాడు. శ్రీ రాముడు మానవులకు ఆదర్శం అనటానికి ఒకే ఒక కారణం రాముడు తన జీవితం లో ఎక్కడా మహిమలు లాంటివి చూపించలేదు. కేవలం వేద ప్రతిపాదితమైన ధర్మాన్ని ఆచరించాడు. కాబట్టి రామధర్మం మానవులకు ఆచరణ యోగ్యమే.

మారీచుడు :

                  "రామో విగ్రహవాన్ ధర్మ సాధు: సత్య పరాక్రమ:" ఈ శ్లోక భాగం రామాయణం లోనిదే. కాని ఈ మాట ఏ వసిష్టునిదో, లక్ష్మనునిదో కాదు సీతపహరణకు సహాయపడిన రాక్షసుడు మారీచునిది. రామాయణాన్ని కొంచం లోతు గా చుస్తే రావణునికి సదుపదేశం చేసిన వారిలో విభీషణుడు, హనుమ, మండోదరి తో పాటు చెప్పుకోదాగిన వాడు మారీచుడు. సీతాపహరణానికి మారీచుని బంగారు జింకగా మారమని రావణుడు ఆదేశించిన సందర్భంలో  మారీచుడు రావణునికి కొన్ని ధర్మసూష్మాలు చెప్తాడు. ఒక రాక్షసుని నుండి కూడా రామాయణం చదవడం ద్వారా మనం ఎన్నో ధర్మసూష్మాలు తెలుసుకోవచ్చు  మారీచుడు రాముని బాణానికి తగిలి బ్రతికిన ఒకే ఒక్కడు మారీచుడు. ఇతడు రాముని బాణధాటిని మాత్రమే కాకుండా రాముని చరితం, సుగుణాలు, ధర్మాచరణ పూర్తిగా తెలిసి, పంచవటి పరిసరాలలో రాముని కంటికి కనపడకుండా రాక్షసధర్మం పాటిస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆ సమయంలో సీతపహరణకు రావణుడు రావడం జరిగింది. ఆ సమయంలో మారీచుడు  రావణునికి చేసిన ఉపదేశం రాముని ధర్మపరాయణతను ఎంతో గొప్పగా వివరిస్తుంది. మారీచుడు రాముని మూర్తీభవించిన  ధర్మంగా  వర్ణిస్తాడు. ఆ  విధంగా రామ ధర్మాన్ని తెలిసిన మారీచుడు తన ప్రాణాన్ని ధర్మం తప్పకుండానే త్యజించాడు. బంగారు జింకగా మారటానికి నిరాకరించిన మారీచుని రావణుడ చంపుతానని భయపెడతాడు. ధర్మాన్ని తెలిసిన మారీచుడు రాజ శాసనాన్ని  ఉల్లంగించి అటు ధర్మద్రోహానికి ఇటు రావణుని చేతులో మరణించి నరకాని వెళ్ళటం కన్న రాజాజ్ఞను పాటిస్తూ మోక్ష హేతువైన  రాముని చేతులో మరణాన్ని ఆశ్రయించాడు. 

         సీతాన్వేషణ సమయంలో హనుమంతుని ద్వారా సీతను రావణుడు అపహరించాడని తెలుసుకొని, రావణుని జయించగల వాడు వాలి అని తెలిసి కూడా ధర్మ బద్దుడైన సుగ్రీవుని తో స్నేహం చేసాడు. రాముడే కనక పూర్వం రావణుని జయించిన మహావీరుడైన  వాలితో స్నేహం చేసి ఉంటే యుద్ధం లేకుండానే సునాయాసంగా సీతను పొందగలిగేవాడు. అప్పుడు కిష్కింద, సుందర, యుద్ద కాండలు ఉండేవి కావు.  ధర్మ మూర్తి అయిన  రాముడు తమ్ముని భార్యను అపహరించిన వాలి ని వధించి ధర్మ స్థాపన చేసాడు.

 

 

 

 

 

continued...............

లలితా స్మరణం : " రక్షాకరీ రాక్షసఘ్ని రామా రమణలంపటా ".  రామ శబ్దాన్ని స్త్రీ లింగంలో పిలిస్తే లలిత. అంతేకాక అమ్మవారి దశ మహావిద్యలను నారాయణుని దశావతరాల సారూప్యతలో "రామో లలితాంబికా" అంటూ  రాముని లలిత రూపంగాను, కృష్ణుని శ్యామల రూపంగా , నృసింహుని ఛిన్నమస్తగా . . . . . . . . .  ఇలా దశావతారాలు చెప్తారు.
- : నాంపల్లి రామకోటేశ్వర్
గండేపల్లి .

  "రామో విగ్రహవాన్ ధర్మ సాధు: సత్య పరాక్రమ:"
Note: the red lettered words are from Lalitha sahasra nama strotram

సంధ్యాసుందరి

శ్రీ:

సంధ్యాసుందరి

           కాల గమనంలో సంధ్యా సమయం ఒక అందమైన భగవత్ సృష్టి. ఈ వ్యాసం శీర్షిక సంధ్యను సుందరిగ వర్ణించటం జరిగింది.  బ్రహ్మ సంధ్య అనే పేరుతో ఒక సౌందర్య రాశిని సృష్టించి ఆమెను మొహించటం వలన ఆమె ఒక లేడి రూపంలో పారిపోవడం, బ్రహ్మ అదే రూపంలో వెంబడించటం, దానికి శివాగ్రహానికి గురవ్వటం, బ్రహ్మ మృగశిర నక్షత్ర రూపంలో మారటం, బ్రహ్మని వెంబడించిన శివుని బాణం ఆర్ద్ర నక్షత్ర రూపంలో మారటం, ఇటువంటి కథ ని మనం శివ మహిమ్న స్త్రోత్రం లో గమనించవచ్చు. కాని ఈ శీర్షికలో మనం తెలుసుకోబోయే సౌందర్యం బ్రహ్మ సృష్టించిన స్త్రీ సౌందర్యం కాదు బ్రహ్మను సృజించిన లోకాతీత శ్రీ సౌందర్యం.  సంధ్యా సమయంలో గోచరమయ్యే త్రిపురసుందరి యొక్క సౌందర్యాన్ని సంధ్యాసుందరి గా వర్ణించే ప్రయత్నం ఈ "సంధ్యాసుందరి" వ్యాసం.

                      సంధ్యా సమయం మొదట చీకటితోను తర్వాత అరుణోదయం ఉండి సూర్యోదయం తో ముగుస్తుంది. కాబట్టి సంధ్య వర్ణం ఉదయించే సూర్యుని వర్ణం(ఉద్యత్భాను సహస్రాభా). సంధ్య అరుణ వర్ణం లోకమంతా వ్యాపించి ఉంటుంది. జగన్మాత ఆమె కరుణను అరుణ వర్ణ ప్రభతో సమస్త బ్రహ్మాండములను ముంచి వేసింది (నిజారుణ ప్రభాపూర మజ్జత్బ్రహ్మాండమండలా) . అంతే కాక ఆమె ధరించిన వస్త్రం రంగు కూడా అరుణారుణ వర్ణమే, ( అరుణారుణ కౌసుంబ వస్త్ర భాస్వత్కటీతటీ ). అది మాత్రమే కాదు, లలిత ధ్యాన శ్లోకాలు కూడా అరుణ వర్ణ వైభవం తోనే ( సింధూరారుణ విగ్రహాం, అరుణాం కరుణాతరంగితాక్షీం, సకుంకుమ విలేపనాం.........)  ప్రారంభామవటం కూడా ఒక విశేషం. కాబట్టి సంధ్య రూపంలో ఉన్నఆమె సర్వారుణ ఐన లలితాంబికే.  లలితా సహస్ర నామలలోని ఒక నామం సంధ్య

"గాయత్రీ వ్యాహృతి సంధ్యా  ద్విజ బృంద నిషేవితా "

        పై శ్లోక భాగం నాలుగు నామాల సమూహం. ఈ నాలుగు నామాల అర్ధాన్ని కలిపి గ్రహిస్తే, నిత్య సంద్యావందనం లో జపించే 24 అక్షరాల గాయత్రీ మంత్రం, దానికి ముందు చేర్చబడే మూడు వ్యాహృతులు, వాటి ద్వారా ఉపాసించబడే సంధ్య కుడా లలిత గానే చెప్పబడింది. ద్విజబృంద నిషేవితా అనే నామం ద్వారా బ్రాహ్మణులు త్రిసంధ్యలలో జపించే గాయత్రి మంత్ర అధిష్టాన దేవత కుడా లలితనే. అంతే కాకుండా గాయత్రీ మంత్రానికి అధిష్టాన దేవతగా  చెప్పబడిన సవిత అనే నామం కూడా లలిత సహస్రనామం సావిత్రి (సర్వార్ధ దాత్రీ సావిత్రీ  సచ్చిదానంద రూపిణి )రూపం లో కలిగిఉంది. కాబట్టి సంధ్యా సమయం లో తప్పనిసరిగా ఆరాధించ వలసిన లలితా త్రిపురసుందరియే సంధ్యాసుందరి. గాయత్రీ  కవచంలో ఆవాహనచేసే గాయత్రి, సావిత్రి, సరస్వతి( సరస్వతి శాస్త్రమయీ గుహాంబా గుహ్య రూపిణి ) అనే మూడు నామాలను లలితా సహస్ర నామస్తోత్రం కలిగిఉంది

భానుమండల మధ్యస్థా 

      లలితా సహస్ర నామాలలో ఇంకొక నామం " భానుమండల మధ్యస్థా " ఆదిత్య హృదయం సూర్యుని సర్వదేవాత్మకునిగా తెలిపింది. కర్మ సాక్షి ఐన సూర్యుని ద్వారా నే దేవతలు కర్మ ఫలాన్ని మానవులుకి ప్రసాదిస్తారు.కాబట్టి మానవులు చేసే కర్మలుకుడా సూర్యుని గమనాన్ని అనుసరిస్తూ  చేయాలనీ శాస్త్రం చెబుతుంది. ప్రాతః సంధ్య లో ప్రధాన దేవతల శక్తీ కలిగిన సూర్య బింబం  క్రమంగా ఒక్కొక్క దేవతల శక్తిని పొందుతూ మద్యాహ్న సమయానికి సమస్త దేవతా శక్తులను కలిగి ఉంటుంది. కాబట్టే యజ్ఞ యాగాదులు సూర్యోదయం తర్వాతనే మొదలు పెట్టాలని పితృ దేవతారాధన అపరాహ్ణ కాలంలో(పితృ దేవతలు సూర్య మండల వర్తులు ఐన తర్వాత) చేయాలనీ చెప్పబడింది. ప్రధాన దేవత ఐన లలిత ప్రాతః కాల సూర్యబింబం లో అరుణ వర్ణం లో సంధ్యా సుందరిలా ప్రకాశిస్తుంది. అంతే కాకుండా గాయత్రి మంత్రాధిష్టాన దేవత ఐన 'సవిత' నామాన్ని కూడా లలితా సహస్ర నామాలు సావిత్రి అనే నామం గా కలిగి ఉంది

      గాయత్రి మంత్రం 24 అక్షరాలలోని మొదటి అక్షరం ఐన "తత్" శబ్దాన్ని ఉపనిషత్తులు పరబ్రహ్మ స్వరూపానికి 'తత్' సర్వనామం గా తెలిపాయి.  (ఓం తత్ బ్రహ్మ, తత్ వాయు :......... అని మంత్రపుష్పం లో కూడా మనం గమనించవచ్చు, అద్వైతంలో మహా వాక్యం ఐన 'తత్వమసి' కూడా తత్ శబ్దాన్ని పరబ్రహ్మ వాచకాన్ని తెలుపుతుంది. )

“చితి: తత్పద లక్ష్యార్దా చిదేకరసరూపిణి” 'తత్పద లక్ష్యార్దా' అనే పదం అమ్మవారిని బ్రహ్మ పద లక్ష్యార్ధం ఉంటుందని తెలుపుతుంది. అదే విదంగా గాయత్రీ లోని "తత్ సవితు:" అనే పదం కూడా పరబ్రహ్మను సవితృ రూపంలో తెలుపుతుంది. గాయత్రీ మంత్రానికి ఛందస్సు గాయత్రి ఐతే సూర్య మండలాన్తర్వర్తి ఐన సవితః దేవత. కాబట్టి సంధ్య సమయం లో ఉపాసించే గాయత్రి "సవితృ గాయత్రి”







శ్రీ



లలితా సహస్రం
continued.........


- : నాంపల్లి రామకోటేశ్వర్
గండేపల్లి 


Note: the red lettered words are from Lalitha sahasra nama strotram

శ్రీ పాద స్మరణం


శ్రీ పాద స్మరణం 

ఏ  తల్లి  పాద  స్పర్శ మాత్రాన  గజముఖుడు  లోకానికి ప్రధమ పూజ్యుడైనాడో.

ఏ  తల్లి పాద స్మరణ మాత్రాన షణ్ముఖుడు ప్రణవాత్మకుడైన పరమేశ్వరునికి  ప్రణవార్ధాన్ని ఉపదేశించగలిగాడో ,

ఏ  తల్లి మంజీర నాదాలను వేదాలగా గ్రహించి బ్రహ్మ సృష్టి చేస్తున్నాడో,

ఏ  దేవి ఆరాధనా ఆధారంతో నారాయణుడు దశాకృతులతో అసురసంహారం చేస్తున్నాడో,

ఏ శక్తి పద ధ్యానలబ్ద శక్తితో రుద్రుడు లయకారకుడు అవుతున్నాడో,

ఏ  దేవి పాదాలు  నిత్యం పశుపతి జటాజూట జలాలతో అభిషేకించ బడతాయో,

ఏ దేవి పాద ధూళి వేద కాంతల సీమంత సింధూరంలా భాసిస్తుందో,

ఏ తల్లి చీర కుచ్చిళ్ళ అంచుల రాపిడితో సమస్త దేవతా మకుటాలు ప్రకాశిస్తాయో,

ఏ తల్లి పారాణి అరుణిమ తాపసులకు జ్ఞానారుణోదయమో,

ఏ కాలి మట్టెల ప్రకాశంతో సూర్య చంద్రులు భాసిస్తారో , 

ఏ దేవి పాద నఖ దీప్తి మానవుల తమోగుణ హరణమో,

అటువంటి ప్రణవాత్మక ప్రణయిని కమలనయన నయన కమలార్చిత పదకమలములను స్మరిస్తూ.........

--------   స్వస్తి  ----------


- : నాంపల్లి రామకోటేశ్వర్
గండేపల్లి  

కార్తీక స్నానం - వైజ్ఞానిక దృష్టి

కార్తీక స్నానం - వైజ్ఞానిక దృష్టి

                    ఈ పోస్ట్ లో  మనం కార్తీక స్నానంలో మన మహర్షులకు గల అంతర దృష్టి ఆలోచించే ప్రయత్నం చేద్దాం. కార్తిక స్నానం తెలుసుకొనే ముందు అసలు "స్నానం" అంటే ఏమిటో ముందు ఆలోచించవలసిన అవసరం ఉంది. అందరికి తెలిసి స్నానం అంటే శరీర శుభ్రత. కేవలం శారీరిక శుభ్రత మాత్రమే అయితే మనిషి అశుభ్రత ఉన్నప్పుడు మాత్రమే స్నానం చేస్తే సరిపోతుంది. కాని మన వైదిక సాంప్రదాయం లో రెండు పూటలా స్నానం చెప్పబడింది. అంతే కాక త్రికాల సంధ్యావందనంలో మూడు పూటలా స్నానం చెప్పబడింది. రోజు శారీరిక శ్రమ లేకుండా వేదాధ్యనం చేస్తూ ఇంట్లో ఉండే వాడికి అశుబ్రత ఏమాత్రం ఉండదు. అలాంటివాడికి కుడా మూడు పూటలా స్నానం అవసరం ఏమాత్రం ఉండదు. ఐనప్పటికీ స్నానం చేయమని ఆదేశించటంలోని అంతర్యం కేవలం శారీరిక శుభ్రతమాత్రమే కాదు అనేది సుస్పష్టం. 
                     స్నానం లో మహర్షులు ప్రత్యేకంగా నిర్దేశించినది అంతరంగిక శుద్ధి. బాహ్య స్నానంతో అంతరంగిక శుద్ధి ఎలా జరుగుతుందో ఆలోచిద్దాం. మనవ శరీరం లోని స్పర్శ జ్ఞానం మొత్తం కేవలం చర్మం లోని నాడుల ద్వారా విద్యుత్ శక్తి మెదడుకు చేరటం ద్వారా పనిచేస్తుంది. చల్లటి నీళ్ళ స్నానం వల్ల శరీరం మొత్తం నాడులు ఒకేసారి చైతన్యం అవటం నేను వివరించవలసిన అవసరం లేకుండా అందరికి అనుభవమే. కాబట్టి స్నానం లోని ప్రధాన ఉద్దేశ్యం శరీర చైతన్యం. మానసిక చైతన్యంతో చేసే జప ధ్యానాలు మాత్రమే కాకుండా దైనందిన కార్యక్రమాలు కుడా సత్ఫలితాలు ఇస్తాయి.  చైతన్యం దేవీ స్వరూపం. దేవీ భాగవత ప్రధమ శ్లోకం గాయత్రీ చందస్సులో "సర్వ చైతన్య రూపాం తాం ఆద్యాం ....... " అని, దుర్గా సప్తశతి "యా దేవి సర్వ భూతేషు చేతనత్యభిదీయతే ....... " అని, లలితా సహస్రం "చిచ్చ క్తి చేతనా రూపా ....... " అని దేవిని కీర్తించాయి. కావున చైతన్యం దేవీ స్వరూపం. బుద్ది చైతన్యం కోరుకోవటం సంధ్యా వందనంలో గాయత్రి మహా మంత్ర ప్రధాన అర్ధం. కాబట్టే "స్నానం సంధ్య" , "చదువు సంధ్యలు" అనే వాడుక పదాలు వచ్చాయి. 
                            అంతే కాక స్నానంలో మనం గమనిస్తే ఇంకా కొన్ని గొప్ప లక్షణాలు కూడా ఉన్నాయి. స్నానం చేసే సమయంలో అసంకల్పితంగా ప్రాణాయామం జరుగుతుంది. ఈ ప్రాణాయామం సాధనా క్రమం లో ఉండక పోవచ్చు కానీ యోగ శాస్త్రం ప్రకారం ప్రాణాయామం ఆయుష్షు ను పెంచుతుంది అనేది వైజ్ఞానికంగా నిరూపించబడిన విషయం. ప్రాణాయామం చిత్తశుద్ది ని పెంచుతుంది కాబట్టే ప్రతి దైవిక కార్యక్రమాలలో ముందు ప్రాణాయామం తప్పనిసరి. ప్రస్తుత పరిస్తితులలో ఇది ముక్కు పట్టుకోవటంలా మారిపోయింది. పట్టుకోమన్నవాడు చెప్పడు. పట్టుకొంటున్న వాడు అడగడు. అది అలా ఉంచితే ఇంకొక ప్రయోజనం స్నానం జటరాగ్ని ని  శాంతింపచేస్తుంది. తద్వారా ఆకలిని తగ్గిస్తుంది. పరమేశ్వరుడు భగవద్గీత లో "అహం వైశ్వానరో భూత్వా ప్రాణినా దేహమాశ్రిత"  అని తెలిపాడు, జటరాగ్ని భగవత్ స్వరూపం. ఇంకా మితాహారం పరమౌషధం అని ఆయుర్వేదం.
                          శిరస్నానంలో బ్రహ్మరంద్రం వద్ద సహస్రారచక్రం మీద పడే నీరు ఆద్యాత్మిక శక్తీని ఇస్తుంది. లలితా సహస్రంలో "సహస్రారాంబుజారూడా సుధాసారాభి వర్షిణి" అనే నామం అమ్మవారు బ్రహ్మ రంద్రం వద్ద గల సహస్రార చక్రంలో ఉంది అమృత ధారలను వర్షిస్తుంది అని తెలుపుతుంది. అమృత ధార అనగా Electric waves గా తీసుకోవచ్చు. ఆ అమృత ధారల ద్వారా ఆరు చక్రాలను చైతన్య పరుస్తుంది. " తటిల్లతా సమరుచి షట్చక్రోపరి సంస్థితా " అనే నామం లో "తటిల్లత" అంటే మెరుపు తీగ Electric waves ను సూచిస్తూ వాటి ద్వారా కింద గల షట్చక్రాలను చైతన్యపరుస్తుంది.
                           ఇప్పటివరకు స్నాన వైశిష్ట్యం తెలుసుకొన్నాం. ఇప్పుడు కార్తీక మాసంలో స్నానం యొక్క విశేషం తెలుసుకొందాం. కార్తీక పురాణం చదివే అలవాటు ఉంటే అందులో గోష్పాదమంత తటాకంలో కుడా గంగానది అంతర్వాహినిగా ఉంటుంది అని చెప్పబడింది. ఎక్కడో హిమాలయాలలో ఉన్న గంగ ఈ నెలలో అన్ని చోట్లలో ఉండటం అసంభవం. మరి వైదిక ధర్మం చెప్పినది అసత్యం కావటం కుడా అసంభవం. మరి ఇక్కడ అంతరార్ధం ఈ నెలలో స్నానం గంగాస్నాన ఫలం ఇస్తుంది. అసలు గంగా స్నాన ఫలం అంటే గంగ జలాలలో ఉన్న ఔషధీ శక్తి, దైవిక శక్తి మనం పొందటం. స్నానం ఆ ఫలితాలు ఇవాలంటే ఆ జలాలలో ఆ శక్తులు ఉండాలి.  కార్తీక మాసంలో జలాలకు ఈ శక్తులు ఎలా వస్తాయో ఆలోచించే ప్రయత్నంచేద్దాం.
                             మొదటిది ఓషధీ శక్తి. ఇది సహజంగా గంగకు హిమాలయాలలోని ఓషధుల వల్ల వస్తుంది. మరి సాధారణ జలాలకు ఎలా వస్తుంది అంటే కార్తీక మాసం వల్ల ముఖ్యంగా కార్తీక మాసంలో చంద్ర కిరణాల వల్ల వస్తుంది. శ్రావణ, భాద్రపద మాసాలలో వర్షఋతువు వల్ల నదులకు నీరు చేరుతుంది. అది వరద నీరు అపరిశుబ్రం. ఆశ్వయుజ మాసంలో ఆ నీరు తేరుకొని శుబ్రమవుతుంది. కాబట్టి ఆశ్వయుజ అమావాస్య దీపావళి వరకు నదీ స్నానం నిషిద్ధం, ఆశ్వయుజ, కార్తీక మాసాలు శరదృతువు. శరదృతువు ప్రధాన లక్షణం మంచి వెన్నెల. పౌర్నమికి కృత్తిక (లేక  రోహిణి)   నక్షత్రం లో చంద్రుడు ఉన్నప్పుడు వచ్చే మాసం కార్తీక మాసం. జ్యోతిశాస్త్రంలో ఆలోచిస్తే కృత్తిక చివరి 3 పాదాలు,  రోహిణి, మృగశిర మొదటి 2 పాదాలు వృషభ రాశి. వృషభం చంద్రునికి ఉచ్చ రాశి కావున బలంగా ఉంటాడు. జలరాశి ఐన కర్కాటకానికి చంద్రుడు అధిపతి. చంద్రుడు సహజ జలతత్వ గ్రాహం. జాలలకు, ఓషధులకు కారకుడు. ఖగోళ జ్యోతిశాస్త్రజ్ఞుడు ఐన వరాహమిహిరుడు నదీ జలాల శుద్ధి క్రమాన్ని వివరిస్తూ సూర్య కిరణాలతో తప్తమై అగస్త్య నక్షత్ర కిరణాలతో విష హరణం జరిగి చంద్ర కిరణాలతో ఔషధీకరణ జరుగుతాయని తెలిపాడు. ఆహార మొక్కలు సూర్య కిరణాలపై ఆధారపడితే ఔషధ మొక్కలు చంద్ర కిరణాలపై ఆధారపడతాయి. ఆయుర్వేదంలో మూలికా సేకరణ జ్యోతిశ్చక్రంలో చంద్రగతి పై ఆధారపడి ఉంటుంది. మూలికకు సంబందించిన నక్షత్రంలో చంద్రుడు ఉన్నప్పుడు సేకరించిన మూలిక మాత్రమే ఔషదంగా పనిచేస్తుంది. కాబట్టి కార్తీక మాసంలో బలమైన చంద్రకిరణాల ద్వారా నదీ జలాలు ఓషధి శక్తీ పొందుతాయి.
                            ఇక జలాలలో దైవీ శక్తి శివ శక్తి. శివుని అష్ట మూర్తులు పంచ భూతాలు(5), సూర్యచంద్రులు(2), యజ్ఞపురుషుడు(1). వీరిలో జలరూప మూర్తి పేరు భవుడు. భవుడు, రుద్రుడు, శర్వుడు, భీముడు ....... మొదలైన 8 నామాలు వారి భార్యల నామాలు మహన్యాస పూర్వక రుద్రార్చనలో మనం వినచ్చు. శివుడు భవుని రూపం లో జలాలను ఆశ్రయించి ఉంటాడు. జ్యోతిశాస్త్రంలో అత్మకారకుడైన సూర్య గ్రహానికి అధిదేవత రుద్రుడు, మనః కారకుడైన చంద్ర గ్రహానికి అధిదేవత గౌరీ. కాబట్టి ఉమామహేశ్వరుల శక్తి జలాలలో చేరుతుంది.
                        దీనిని బట్టి శాస్త్రీయంగా చంద్ర కిరణ ప్రభావం ఉన్న నీటితో చేసే స్నానం కార్తిక స్నానం.  కార్తీక పురాణం గోష్పాదమంత తటాకం(ఆవు అంగ వేసినంత చిన్న విస్తీర్ణం గల తటాకం) లో కుడా గంగ అంతర్వాహిని అనటానికి కారణం ఇదే. వైదిక ధర్మాలను సశాస్త్రీయంగా తెలుసుకొని ఆచరించినప్పుడు మాత్రమే వాటి ఫలితాలను పరిపూర్ణంగా పొందగలము. 
      కార్తీక మాసంలో మరో ముఖ్యమైనది కార్తీక దీపం దీని సశాస్త్రీయత కుడా మరో పోస్ట్ లో తెలుసుకొందాం .........

-:   స్వస్తి   :-
                          
- : నాంపల్లి రామకోటేశ్వర్
గండేపల్లి

అచ్చ తెలుగు బుజ్జి గణపయ్య

అచ్చ తెలుగు బుజ్జి గణపయ్య 
         ఇప్పటి వరకు గణపతిని వేద గణపతి, నాద గణపతి వ్యాసాలలో మహా గణపతి, బ్రహ్మణస్పతి, విఘ్నేశ్వరుడు ఇలా కొంచం గొప్ప పదాలతో గ్రాంధిక బాషతో, కొంచం సంస్కృత సమాసాలతో రాశాను. కానీ ఈ పోస్ట్ లో అచ్చ తెలుగు బుజ్జి గణపయ్య
   ఇక్కడ మంచి తెలుగు పదాలతో. పద్యాలతో, మన బుజ్జి గణపతిని  అచ్చ తెలుగు లో, పచ్చిగా ,పిచ్చిగా  వచ్చింది  నచ్చినట్టుగా ముచ్చటిద్దాం 

ముందు నా చిన్నప్పుడు మా తాతమ్మ చెప్పిన చిన్న పాట తో మొదలెడదాం .
    "  ఒక్కపంటి పొట్టివాడ, నీకు నీ వందనంబు చేసేదార 
    ముక్కు బారెడైన పైకి నిక్కపొడిచి కుడుములన్ని మెక్కి పొట్టపగిలి పాము నోక్కదాన్ని చుట్ట్టినట్టు 
     ఒక్కపంటి పొట్టివాడ, నీకు నీ వందనంబు చేసేదార "

మొత్తం నాకు గుర్తు లేదు కాబట్టి కొంచమే చెప్పాను. ఏంటి ఇలా ఉంది, ఇది గణపతి పాటా కాదా  అనుకోవద్దు ఇది ఖచ్చితం గా గణపతి పాటే ఎలానో చూద్దాం .
ఇక్కడ " ఒక్కపంటి పొట్టివాడు " అంటే ఎవరో కాదు మన బొజ్జ గణపయ్య. కోత్తగా ఏదో కాదు ఏక దంత  (ఒక్క/ఏక పన్ను/దంతం ) , వికట (మరుగుజ్జు/పొట్టి వాడు ) నామాలను కలిపి అచ్చ తెలుగు లో అందంగా చప్పారు. ఇది పల్లవి 
ఇక చరణం "ముక్కు బారెడు" అంటే తొండం (బారు ముక్కు ఉండేది ఏనుగు దాని తల గజముఖుడు/గజాననుడు  ), బారెడు ముక్కు ను పైకి "నిక్కపొడిచాడు" అంటే దాన్ని వేలాడకూడా పైకి మడిచాడు(వక్ర తుండ నామం. ఊరకనే ఏమీ మడవలేదు కుడుములు మెక్కటానికి తొండం ఎత్తాడు 
ఇక్కడ
 1. తొండం ఎత్తాడు అంటే కుడుములు(మోదకములు) చేతులో ఉన్నాయ్. కాబట్టి మోదక హస్తుడు
2. కుడుములు మెక్కుతున్నాడు కాబట్టి మోదక ప్రియుడు అనే నామాలు గుర్తు చేసుకోవచ్చు.  
   ఈన మెక్కటం అట్టా ఇట్టా కాదు గట్టిగానే పొట్ట పగిలేదాకా మెక్కాడు. పొట్ట పగిలింది కాబట్టి వాళ్ళ నాన్న మెళ్ళో ఒక్క  పామును తెచ్చి చుట్టి పొట్ట కుట్టారు. మొత్తం పాట గుర్తుంటే బాగుండేది 
సరే ఇదీ అచ్చ తెలుగు అంటూ చెప్పిన పచ్చి తెలుగు అందం.

"ఒక్కపంటి పొట్టివాడు" అన్నందుకు  పైన ఫోటోలో మన బుజ్జి గణపతి  అలిగినట్టున్నాడు, ఇప్పుడు మంచి అందమైన తెలుగు పద్యం చూద్దాం 

"అంకము జేరి శైల తనయాస్తనదుగ్ధము లానువేళబా
     ల్యాంకవి చేష్ట దొండమున నవ్వలిచన్ గబళింపబోయి, యా
వంకకుచంబుగానకహి వల్లభహారము గాంచి వేమృణా
ళాంకురశంకనంటెడు గజాస్యుని గొల్తునభీష్ట సిద్ధికిన్''
ఇది అల్లసాని పెద్దన మనుచరిత్ర ప్రారంభిస్తూ రాసిన పద్యం  

పసిబిడ్డలు తల్లి ఒడిని చేరి ఒక వంక చనుబాలు తాగుతూ వేరొకవంక ఉన్న స్తనాన్ని చేతితో తడమతం  సహజం పార్వతీదేవి వద్ద పాలు తాగుతున్న పిల్లగణపతి తన తొండంతో  చేసే పిల్ల చేష్టను పెద్దన చమత్కరించాడు. అలా పార్వతికి ఒకవైపు తాగుతున్న గణపతి పార్వతి రెండవవైపు తాగడానికి తొండాన్ని చాచాడు. ఆ వైపు స్తన్యము కనిపించలేదు. సర్పహారాలు కనిపించాయి. అదేంటి పైన ఫోటోలో బాగానే రెండు ఉన్నాయే అనుకోకండి సరైన ఫోటో దొరకలేదు అందుకే కింద ఇంకో ఫోటో ఉంచాను . ఇక్కడ పెద్దన పెద్ద పనే చేసారు. బుజ్జి గణపతిని స్తుతిస్తూనే ఆది దంపతి ఐన (సంస్కృతం ప్రకారం దంపతులు అనేపదం లేదు) పార్వతీ పరమేశ్వరుల అద్వైత తత్వాన్ని అర్ధనారీశ్వర రూపంలో స్మరించాడు. కాబట్టి ఒక్క వైపు స్త్రీ(పార్వతి) కాబట్టి  చన్ను ఉన్నది ఇంకొక వైపు పురుషుడు నాగాభరణుడు కాబట్టి పాముఉంది. గణపతి పిల్ల ఏనుగు కాబట్టి పామును ఆయనకి ఇష్టమైన లేత తామరతూడనుకొని తొందరగా పట్టుకోబోతున్నాడు. అలాంటి ఆయనకే ఏం పట్టుకొంతున్నాడో తెలియని బుజ్జి గణపతి నా కోరికలెల్ల సిద్ధించుటకై సేవిస్తానని పెద్దన స్తుతించాడు.
ఒకే పద్యం లో గణపతిని అద్వైత స్వరూపులైన పార్వతి పరమేశ్వరులని కనపడకుండా అందంగా తెలిపిన నాకిష్టమైన పద్యమిది.


                 శ్రీ కంఠార్ద శరీరిణి 

అన్ని పోస్ట్ ల లో లానే ఇక్కడ కూడా సందర్భానికి తగ్గట్టు లలితా స్మరణం శ్రీ కంఠార్ద శరీరిణి.

కుమార గణనాదాంబా, తుష్టి: పుష్టి మతి ధృతి:  
          దీనికి అర్ధం కుమార స్వామికి, మన బుజ్జి గణపతికి అమ్మ. తర్వతః నాల్గు నామాలకు వేరే అర్ధాలు ఉన్నా వాటికి అర్ధం చెప్పే ధైర్యం లేక నాకు తెలిసిన చమత్కారంతో  చెబుతా.
     తుష్టి:గా  పుష్టిగా వాళ్ళకు తిండి పెట్టింది. వాళ్ళను మతిగల వాళ్ళ లాగా బలంగా చేసింది. కాకపోతే బొజ్జ గణపతికి కాస్త ఎక్కువ పెట్టింది ఎందుకంటే ఆవిడ అవ్యాజ కరుణా మూర్తి కదా. బుజ్జి గణపతి  కాస్తా బొజ్జ గణపతి అయ్యాడు. రెండో వాడికి పెట్టలేదా అనకండి మా లలితమ్మ తప్పు ఏమీ లేదు. వాడికి ఆరుముఖాలు (షణ్ముఖుడు)   ఆరు ఆలోచనలతో సరిగా తినక స్లిమ్ గా ఉన్నాడు. మా బుద్ది గణపతి బుద్దిగా తిని బొద్దుగా అయ్యాడు.


నా చిన్నప్పుడు నేర్చుకొన్న కొన్ని తెలుగు పద్యాలు 

తొండము నేకదంతమును తోరపు బొజ్జయు వామహస్తమున్‌
మెండుగ మ్రోయు గజ్జెలును మెల్లని చూపుల మందహాసమున్‌.
కొండొక గుజ్జురూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జయై
యుండెడి పార్వతీ తనయ ఓయి గణాధిప నీకు మొక్కెదన్‌.

అటుకులు కొబ్బరి పలుకులు చిటిబెల్లము నానబ్రాలు చెరకురసంబున్
నిటలాక్షు నగ్రసుతునకు బటుతరముగ విందుచేసి ప్రార్థింతుమదిన్ ॥

తలచెదనే గణనాధుని, తలచెదనే విఘ్నపతిని, దలచిన పనిగా
దలచెదనే హేరంబుని, దలచెద నా విఘ్నములవి తొలగుట కొరకున్ ॥


ఈ పోస్ట్ పై  మీ విలువైన సలహాలకు సవరణలు, సందేహాలకు వివరణలు తప్పకుండా ఉంటాయి 
Note: the red lettered words are from Lalitha sahasra nama strotram 


- : నాంపల్లి రామకోటేశ్వర్
గండేపల్లి


 


వినాయక చవితి

వినాయక చవితి జరుపుకొనే ముందు ?



             వినాయక చవితి. అసలు పత్రి అంటేనే ఆకులు.అయితే ఏ ఆకులు దొరికితే వాటిని కోసుకోస్తాం.  ఒక్క వినాయకుడికే ఈ పత్రి పూజ ఎందుకు చేస్తాం?  ఏయే ఆకులను పత్రిగా ఉపయోగిస్తారు? వినాయకచవితి రోజున నినాయకుని విగ్రహాన్ని తెచ్చే ముందు గుర్తు పెట్టుకోవలసిన విషయాలను తెలుసుకొందాం. 
               ఆకులతో పూజించబడేది మనకు తెలిసి హనుమంతుడు, వినాయకుడు. దీనికి కారణం కోతికి, ఏనుగుకు ఆకులంటే ఇష్టం కాబట్టి. వినాయకునికి 21 అకులేంటి. హనుమంతునికి ఒక్క తమలపాకు ఏంటి అనే వాటికీ శాస్త్రీయంగా, ఆయుర్వేద పరంగా చాలా  కారణాలు ఉన్నాయి అవి నాకూ పూర్తిగా తెలియదు తెలిసిన కొన్ని చివరలో తెల్సుకొందాం 
         నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలో వినాయకచవితి మార్కెట్ల లో కొన్ని వాడకూడని(వయ్యారిభామ, లాంటి ఇంకా కొన్ని కలుపు, పిచ్చి మొక్కలు)  , వ్రతకల్పం లో చెప్పనివి కొన్నిఅమ్మటం చూసాను. కాబట్టి ఇక్కడ  ఫోటోలతో ఇవ్వటం వలన ఈ పోస్ట్ కొంత ఉపయోగ పడచ్చు. వ్రతకల్పం లో చెప్పిన వాటిలో జాజి, గన్నేరు, దానిమ్మ, తులసి లాంటివి ఇంటిలోనే దొరుకుతాయి. ఇంకా మరువం,దవనం లాంటివి ఎప్పుడు దొరుకుతూనే ఉంటై . ఉమ్మెత్త, రేగు, ఉత్తరేణి, జిల్లేడు  లాంటివి ప్రతి ఖాళీ స్తలాలలో పెరుగుతూ ఉంటాయి. బిల్వ దళాలు (మూడు ఆకులు కలసినవి మాత్రమే వాడాలి) శివాలయాల వద్ద విక్రయిస్తారు. మామిడి ఆకులు ఎలాగు ఉంటాయి. రావి చెట్లు కనబడుతూనే ఉంటాయి. మద్ది, జమ్మి కూడా రహదారుల పక్కన సాధించవచ్చు. దేవదారు పత్రం హిమాలయాలలో ఉంటుంది కాబట్టి కష్టం. గరిక గురించి చివరలో చెప్పుకొందాం. మిగిలినవి నేను హైదరాబాద్ మార్కెట్లలో కూడా చూసినట్లు లేదు. కొన్ని నాకూ తెలియవు, కొన్ని తెలిసినా  ఎక్కడ దొరుకుతాయో చెప్పలేను. కాబట్టి మార్కెట్ కి వెళ్లి తెలిసి తెలియనివి, చేయకూడనివి అన్నీ తేవడం కన్నా తెలుసుకోని, దొరికినవి, వ్రతకల్పంలో చెప్పినవి, కొన్నైనా చాలు.  
గరిక : ఇది అన్నిటిలా పత్రీ (ఆకులు) కాదు, ఇది గడ్డి. కాబట్టి దుర్వార పత్రీ అనకూడదు దుర్వార యుగ్మం అనాలి. ఈ గడ్డిని  దుర్వాలు, దర్భలు, కుశలు, రెల్లు  . . . అంటూ  అని  ధర్మసిందు ఈ జాతిని పది రకాలుగా చెప్పింది. వీటిలో ఒకటి దొరకనప్పుడు ఇంకొకటి ప్రత్యామ్నాయంగా వాడచ్చు. ఇది ఒక్కటి మాత్రం మార్కెట్లలో కూడా రకరకాలుగా దొరుకుతుంది. వీటి గొప్పతనాన్ని గురించి అన్ని పురాణాలూ వర్ణించాయి. పవిత్రం (ఈ గడ్డితో చేసే ఉంగరం) ధరించకుండా చేసే ఏ కర్మలకూ (యజ్ఞాలు, పితృ కార్యాలు ) ఫలితం ఉండదని శాస్త్రం చెబుతుంది. ఇక వీటి గొప్పతనం ఎలా వచ్చిందో అనేది వేరే పోస్ట్ లో తెలుసుకొందాం  ఇవి గణపతి ఎంతో ఇష్టమైనవి. ఏ  పత్రీ లేకుండా ఒక్క గరిక తో కూడా గణపతిని పూజించవచ్చు.
 
ఏక వింశతి(21) పత్రి 
1. మాచీ పత్రం (మాచి పత్రి)
 2. బృహతీ పత్రం (వాకుడు)
 3. బిల్వ పత్రం (మారేడు)
4. దూర్వాలు (గరిక)
 5. దత్తూర పత్రం (ఉమ్మెత్త)
 6. బదరీ పత్రం (రేగు)
 7. అపామార్గ పత్రం (ఉత్తరేణి)
 8. తులసీ పత్రం (తులసి)
 9. చూత పత్రం (మామిడి)
 10. కరవీర పత్రం (గన్నేరు)

11. విష్ణుక్రాంత పత్రం (విష్ణుకాంత)
 12. దాడిమీ పత్రం (దానిమ్మ)
 13. దేవదారు పత్రం
14. మరువక పత్రం (మరువం)
 15. సింధువార పత్రం (వావిలి)
 16. జాజీ పత్రం (జాజి)
17. గండకీ పత్రం (దేవకాంచనం)
 18. శమీ పత్రం (జమ్మి)
 19. అశ్వత్థ పత్రం (రావి)
 20. అర్జున పత్రం (మద్ది)
 21. ఆర్క పత్రం (జిల్లేడు)

                            ఇప్పుడు వినాయకుని విగ్రహం గురించి తెల్సుకొందాం. ఆగమం ప్రకారం పూజించే విగ్రహం ఏదైనా లోపల  లొట్ట (Hallow) గా ఉండకూడదు గట్టి (solid) గా ఉండాలి. అలాంటి  విగ్రహాలు పూజకు అనర్హం. ప్రస్తుతం అన్నిచోట్ల వాడే ప్లాస్టర్ అఫ్ పారిస్  విగ్రహాల గురించి నేను మాట్లాడను. విగ్రహం దేనితో చేయాలని ఆలోచిస్తే విగ్రహం చేసే పదార్దం ప్రకృతిలో పుట్టి, ప్రకృతిలో కలిసేట్టుగా ఉండాలి. అంటే రాయి, ఆగమం చెప్పిన లోహాలు రాగి. ...,. గణపతి విషయానికొస్తే 9 రోజుల వ్రతానికి  కాబట్టి నాకు తెలిసి మట్టి, పసుపు పిండి లాంటివి ఉత్తమం.
తర్వాత వినాయకుని ఆకారం. వినాయకుని ఆకారం గణేశ ఉపనిషత్ ఈ విధంగా చెప్పింది
        గణేశ ఉపనిషత్ ప్రకారం వినాయకుడు ఏనుగు ముఖం ఒక దంతం నాల్గు చేతులు నాల్గు చేతుల్లో వాళ్ళ అమ్మ లాగే పాశాంకుశాలు మిగిలిన రెండు చేతుల్లో విరిగిన రెండో దంతం(రదం), వరద హస్తం ఉంటాయి. అయన ధ్వజం మీద ఉండే ఎలుకే వాహనం. అయన రంగు కూడా వాళ్ళ అమ్మ లాగే ఎరుపు(సర్వారుణా,రక్త వర్ణా )., లావు పొట్ట(లంబోదరం). చేట ల్లాంటి చెవులు(శూర్ప కర్ణకం), వాళ్ళ అమ్మ లాగే ఎర్రటి బట్టలు( అరుణారుణ కౌసుంబ వస్త్ర భాస్వత్కటీతటీ). వాళ్ళ అమ్మ లాగే ఎర్రటి గంధం అన్నా ఎర్రటి పూలన్నా ఇష్టం. పొట్ట, చెవులు మాత్రం వాళ్ళ అమ్మ లాగే కాదు పైన మంత్రం అర్ధం వరుసలో వచ్చింది  అంతే. (సంస్కృతం లో రక్తం అంటే BLOOD కాదు RED. రుధిరం అంటే BLOOD, శూర్పం అంటే చేట ). ఈ ఆకారం తోనే విగ్రహాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా చాల రకాలతో ఉన్న ఇదే ఇందుకు చెప్తారు అంటే   వేద గణపతి : మహాగణపతి వ్యాసం చుడండి 
           వినాయక విగ్రహం, పత్రీ తర్వాత తెలుకోవలసినది వినాయక పూజ. ఇది వ్రతకల్పం పుస్తకం లో ఉంటుంది. సామాన్యంగా అన్ని పుస్తకాలలో పురాణోక్తంగా శ్లోకాలతో షోడశోపచారపూజ  ఉంటుంది . తెలిసినవాళ్ళు వేదోక్తంగా వేదమంత్రాలైన గణపత్యథర్వ శీర్షోపనిషత్, రుద్రసూక్త, మరియు  పురుషసూక్త విధానాలతో చేసుకోవచ్చు. నిత్య షోడశోపచారపూజ లో గల ఆంతర్యాలను, వివరణలు వేరొక పోస్ట్ లో చూద్దాం. తర్వాత వినాయక వ్రతకథ చదువుతాం/వింటాం. వినాయక వ్రతకథ కు కొంత ప్రత్యేకత ఉంది దీనిని ఈ బ్లాగ్ లోని నా వ్యాసం వినాయక వ్రతకథ : ఆలోచనామృతం లో గమనించవచ్చు.

 గణపతి స్తోత్రాలకు కొన్ని లింకులు 
వినాయక  వ్రతకల్పం
గణేశ అష్టోత్తర శత నామావళి 
గణేశ మంగళాష్టకమ్ 
గణేశ ద్వాదశనామ స్తోత్రమ్ 
గణపతి గకార అష్టోత్తర శతనామ స్తోత్రమ్
మంత్ర పుష్పమ్
గణేశ మంగళాష్టకమ్ 

ఈ పోస్ట్ పై  మీ విలువైన సలహాలకు సవరణలు, సందేహాలకు వివరణలు ఉంటాయి. వ్యాఖ్యల ద్వారా పంచుకోగలరు 

Note: the red lettered words are from Lalitha sahasra nama strotram 



- : నాంపల్లి రామకోటేశ్వర్
గండేపల్లి

గోవిందుడు


శ్రీ పోతన గారు రచించిన ఆంద్ర మహా భాగవతం నుంచి సేకరించ బడినది.

సరస్వతి

                               శ్రీ పోతన గారు రచించిన ఆంద్ర మహా భాగవతం నుంచి సేకరించ బడినది.సరస్వతి

గణపతి

                                                                      గణపతి

శ్రీ పోతన గారు రచించిన ఆంద్ర మహా భాగవతం నుంచి సేకరించ బడినది.